అండగా నిలుస్తాం

హైదరాబాద్, అక్టోబర్ 15: హుద్ హుద్ తుపాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షన సాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్రమోదీ వెయ్యి కోట్ల రూపాయలను ప్రకటించారు. విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి ప్రధాని మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. పూర్తిగా ధ్వంసమైన వైజాగ్ విమానాశ్రయాన్ని మోదీ పరిశీలించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను pressmeet-pmపరామర్శించారు. సర్వే పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయి సాయం అందిస్తామని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అనంతరం మోదీ సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు.

ప్రజలకు తక్షణావసరాలైన ఆహారం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయటంతో ప్రాణనష్టం తగ్గిందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటనష్టాన్ని త్వరలోనే అంచనావేసి, దానికనుగుణంగా సహాయక చర్యలు చేపడుతామన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రజలను ఆదుకొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉంది.  కేంద్ర రాష్ర్టాలు కలిపి పనిచేస్తే ఇలాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవచ్చని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలబడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

photo exhibition-modiవిశాఖ కలెక్టరేట్ కు చేరుకున్న ప్రధాని మోదీ తుపాను బీభత్సాన్ని తెలియజేసే చిత్రప్రదర్శనను తిలకించారు. ఆ తరువాత సీఎం, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో దాదాపు 27 మంది పాల్గొన్నారు. ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు తదితరులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.