అందరికి సమాన ఆదరణ : గవర్నర్ నరసింహన్

governor speech-7 sakalam

హైదరాబాద్: రాజ్యాంగ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా సమాన ఆదరణ ఉంటుందని రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహాన్ ప్రసంగించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యుల నిరసన కొనసాగిస్తుండగానే, గవర్నర్ కేవలం 14 నిమిషాల్లోపుగానే తన ప్రసంగాన్ని ముగించారు.

2013-14 లో రాష్ట్రంలో 4.8 శాతం వృద్ది రేటు ఉండగా, 2014-15 లో ఆర్థికవృద్ది 5.3 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రతికూల రుతుపవనాల వల్ల వ్యవసాయవృద్దిలో తగ్గుదల ఏర్పడినా, పశుగణం, అటవీ ఉత్పత్తులు, మత్య్సరంగాల్లో మంచి వృద్దిరేటు నమోదైందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కైతి లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్ టీ లుగా గుర్తిస్తామన్న వాగ్ధానాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. అదే విధంగా ఎస్సీల సమగ్ర అభివృద్ది కోసం ప్రభుత్వం 50 వేల కోట్ల మొత్తాన్ని ప్రతిపాదించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు.

రాష్ట్ర బడ్జెట్ లో ఎస్టీలకు 4,400 కోట్ల అభివృద్ది పనులను చేపడుతున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం 25 వేల కోట్లను సమకూర్చాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నట్టు గవర్నర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహారించిన ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ తో వేతన సవరణ చేసిన విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది న్యాయవాదులు, జర్నలిస్టులు కీలకంగా వ్యవహారించి తమ పాత్రను పోషించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి గవర్నర్ ప్రస్తావించారు. హైదరాబాద్ ను సురక్షిత నగరంగా పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు గవర్నర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో పోలీస్ ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను తీసుకొందని గవర్నర్ తెలిపారు.

రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు హారిత హారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలోని అడవులను 25.16 శాతం నుండి 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు 13.5 లక్షల ఎకరాలకు వర్తింపజేస్తూ పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు. మిషన్ కాకతీయను 20 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.