అందరి అమ్మ…. బతుకమ్మ

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవితాల్లో బతుకమ్మ ఒక భాగమని, సమాజం అంతా కలిసి జరుపుకునే వేడుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి బతుకమ్మ పండుగతో నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని, ఇందుకోసం ఇతర సెలవులను సర్దుబాటు చేయాలని, ఇవి ఖచ్ఛితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

తెలంగాణ ప్రజలు ఏ పండుగనైనా సామూహికంగా కలిసిమెలిసి జరుపుకుంటారని, ఇది తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని ప్రశంసించారు. బతుకమ్మ పాటల్లో దేవతలను స్మరించడం, వీర గాథలు, కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, త్యాగం, ప్రేమ వంటివన్నీ కలబోసుకుని ఉంటాయని తెలిపారు. అందుకనే బతుకమ్మను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించి ఖర్చకు వెనుకాడకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరక్షరాస్యులు సైతం బతుకమ్మ పాటలను రాగయుక్తంగా పాడుతారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని పూర్తిగా విస్మరించారని, పండుగ సెలవుల్లో సైతం వివక్ష ఎదురైందని అన్నారు. తెలంగాణ పండుగలను గుర్తించి సెలవులు ఇచ్చే విధంగా విద్యా సంవత్సర క్యాలెండర్‌ను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం సచివాలయంలో తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను సాంస్కృతిక పునరుజ్జీవన వేడుకగా నిర్వహించాలని సూచించారు.

సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, కరీంగనర్ ఎంపీ వినోద్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.