అకాల వర్షాలకు కుదేలైన రైతాంగం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీటపాలయ్యే సరికి రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆరుకాలలపాటు శ్రమించిన రైతుకి ఈ అకాల వర్షం ఎంతో నష్టానికి గురిచేసింది. దీనికితోడు వ్యవసాయానికి చేసిన రుణాలు ఏ విధంగా తీర్చాలో అని రైతాంగం తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోరుతున్నారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 40,131.88 వేల హెక్టార్లలో పంట నష్టానికి గురయ్యాయి. దీంట్లో 35,175.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు పంట నష్టం అంచనాలను సేకరిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 నుండి 13వ తేది వరకు కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కొద్ది రోజుల్లోనే పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు  గురయ్యారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 15,403.2. హెక్టార్లలో వరితో సహా పలు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. కరీంనగర్ తర్వాత నల్గొండ జిల్లాలో 11969.3 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అదే విధంగా నిజామాబాద్ లో 7039.0 హెక్టార్లు, ఆదిలాబాద్ లో 2401.0 హెక్టార్లు, మహాబూబ్ నగర్ లో 1344 .4 హెక్టార్లు, రంగారెడ్డి లో 763 హెక్టార్లు, మెదక్ లో 700 హెక్టార్లు, ఖమ్మంలో 434 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 78 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు దెబ్బతిన్న పంట నష్టాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

మరో వైపు ఉద్యానవన పంటలు కూడా ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలో 20,343.6 హెక్టార్లు, ఆదిలాబాద్ లో 2076 హెక్టార్లు, మహాబూబ్ నగర్ లో 1197.5 హెక్టార్లు, రంగారెడ్డిలో 864.1 హెక్టార్లు, నిజామాబాద్ లో 960 హెక్టార్లు, వరంగల్ లో 2622 హెక్టార్లు, నల్గొండ లో 1644.2 హెక్టార్లలో ఉద్యానవన పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఉద్యానవన పంటల్లో అత్యధికంగా మామిడి పంట దెబ్బతింది. ప్రాథమికంగా ఉద్యానవపంటలు సుమారు 5079.6 లక్షల రూపాయాలను నష్టపోయినట్టు అధికారులు అంచనావేశారు. అధికారులు సేకరించిన సమాచారం ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించనున్నారు.

పరిహారం చెల్లింపు వ్యవహారంలో ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడ రాష్ట్రంలో పంట నష్టపోయిన వివిధ జిల్లాల్లో పర్యటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడ ఉదారంగా సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.