అగ్రశ్రేణి శాస్త్రవేత్తకు అవమానం

  • డీఆర్ డీవో అధినేతకు అకస్మాత్తుగా ఉద్యవాసన
  • యువశాస్త్రవేత్త ఆ పదవిలో ఉండాలంటూ  రక్షణమంత్రి వ్యాఖ్య

(సంజయ)

దిల్లీ, అగ్ని క్షిపణికి ప్రాణం పోసిన శాస్త్రవేత్తను అవమానిస్తున్నామా? వాజపేయి హయాంలో అణుపాటవ పరీక్ష నిర్వహించిన ఫలితంగా అగ్రరాజ్యాలు భారత్ ను బహిష్కరించినప్పుడూ, నిషేధాలు విధించినప్పుడూ స్వశక్తితోనే భారత్ అణుశక్తి రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ పురోగమించగలదని ప్రపంచానికి చాటి చెప్పిన అరుదైన శాస్త్రవేత్తను నరేంద్రమోదీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదా? డిఆర్ డీవో డైరెక్టర్ అవినాశ్ చందర్ పదవీచ్యుతిలో ఈ పెడధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. మోదీ మనసులో మాట గ్రహించలేకపోవడమే, మోదీ తానా అంటే తందానా అనకపోవడమే అవినాశ్ పదవికి గండం తెచ్చిందనేది శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్న మాట. యువశాస్త్రవేత్తను రక్షణ పరిశోధన సంస్థకు అధినేతగా నియమించాలని అనుకున్నామంటూ రక్షణ మంత్రి మనోహన్ పారికర్ చేసిన ప్రకటన ఏ మాత్రం ఊరట కలిగించడంలేదు. యువశాస్త్రవేత్తను నియమించదలచినట్లయితే అదే పని మరింత హుందాగా, సంస్కారవంతంగా చేయవలసింది. కుర్చీకి అంటిపెట్టుకొని కూర్చోవలసిన అవసరం కానీ, అటువంటి స్వభావం కానీ అవినాశ్ కు లేవు. నరేంద్రమోదీ, పారికర్ ల తీరు మాత్రం వెగటుపుట్టించేదిగా ఉంది.

రక్షణ పరికరాలను దేశంలో ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసే ఉద్దేశంలో మోదీ సర్కార్  ఉన్నదనీ, ఇందుకోసం పరుగులు తీసే యువశాస్త్రవేత్తను డీఆర్ డీవో అధిపతిగా నియమించాలని ప్రభుత్వం అనుకున్నదనీ చెప్పడంలోనే ప్రస్తుత అధినేత ప్రభుత్వ ప్రణాళిక అమలు జరగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణ పరోక్షంగా ఉంది. వాస్తవంగా దేశీయ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన అవినాశ్ ను డైరెక్టర్ పదవి నుంచి మర్యాదగా తప్పించి సలహాదారుగా పెట్టుకుంటే బాగుండేది. ఈ విధంగా అమర్యాదగా, అవమానకరంగా సాగనంపాలని ప్రయత్నించడం, పదవీచ్యుతి గురించి అవినాశ్ కు సమాచారం కూడా లేకపోవడం అనాగరికంగా, అరాచకంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రక్షణ పరిశోధనలూ, అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ – డిఆర్ డీవో) అధినేత డాక్టర్ అవినాశ్ చందర్ ను పదవి నుంచి ఆకస్మికంగా తప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. పదవీ విరమణ వయస్సు దాటి కాంట్రాక్ట్ పద్ధతిలో పదవిలో ఉన్నవారి కంటే తక్కువ వయస్సున్నవారికి బాధ్యతలు అప్పగించడం ఉత్తమం అని ప్రభుత్వం భావించిందంటూ మనోహర్ పారికర్ చేసిన ప్రకటన అంత సమంజసంగా కనిపించడం లేదు.

డాక్టర్ అవినాశ్ చందర్ పదవీ విరమణ వయస్సు దాటిన తర్వాత కూడా జీతం కోసం పదవిలో కాంట్రాక్టు పద్ధతిపైన కొనసాగుతున్న సాధారణ ఉద్యోగి కాదు. నాలుగు దశాబ్దాలుగా దేశ రక్షణ రంగంలో పరిశోధనలకూ, అభివృద్ధికీ విశేషంగా దోహదం చేసిన ప్రతిభావంతుడు. అగ్రశ్రేణి శాస్త్రవేత్త. అగ్ని క్షిపణికి పితామహుడు. దిల్లీ ఐఐటీ నుంచి ఇంజనీరింగు పట్టా పుచ్చుకున్న అవినాశ్ అగ్ని క్షిపణుల పరంపర సృష్టికర్త. మన క్షిపణులకు ఘనపదార్థ రూపంలో ఉండే ఇంధనం వినియోగించే విషయంలో చాలా లోతైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త.

భారత్ అణుపాటవ పరీక్షను 1998లో నిర్వహించిన తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు భారత్ పైన ఆంక్షలు విధించిన కారణంగా శాస్త్రసాంకేతిక రంగాలలో సంబంధాలు పూర్తిగా తెగిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేశీయంగానే సాంకేతికాభివృద్ధి సాధ్యమని చేసి చూపించినవాడు అవినాశ్. సమీకృత క్షిపణి కార్యక్రమం అగ్ని ప్రయోగంలో చాలా దొహదం చేసింది. డాక్టర్ అవినాశ్ డిఆర్ డీ వో లో 1972లో చేరారు. ఆయనతో సంస్థ కుదుర్చుకున్న కాంట్రాక్టు  ఈ సంవత్సరం జనవరి 31 నాటికి పూర్తవుతుంది.

నిరుడు ఆగస్టులో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలో సభలో ప్రసంగించినప్పుడు డాక్టర్ అవినాశ్ పనితీరు పట్ల అసంతృప్తి వెలిబుచ్చినట్టు తెలిసింది. అదే అభిప్రాయం క్రమంగా బలపడి అవినాశ్ ఉద్వాసనకు దారితీసి ఉండవచ్చునని ప్రభుత్వ వర్గాల భోగట్టా. ప్రధాని మోదీ ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోలేనివారికీ, ఆయనతో సమానంగా పరుగులు తీయలేనివారికీ ఇదే రకంగా నిష్ర్కమణ అనివార్యం అవుతుందనే హెచ్చరికను పంపించడం కూడా ఈ చర్యలోని ఆంతర్యం కావచ్చునని పరిశీలకులు అనుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.