అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శత జయంతోత్సవాలు

Neelam-sanjeeva-reddy

అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో గవర్నర్ నరసింహన్, ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సభలో మంత్రి శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు.

ఈ తరం రాజకీయ నాయకులకు నీలం సంజీవరెడ్డి స్ఫూర్తిగా నిలిచారని గవర్నర్ నరసింహన్ చెప్పారు. నీలం సంజీవరెడ్డి గొప్ప రాజకీయ వైతాళికుడు అని ఆయన ప్రస్తుతించారు.

నీలం సంజీవరెడ్డి దేశానికే గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి పదవికే సంజీవరెడ్డి వన్నె తెచ్చారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సంజీవరెడ్డి ప్రజలకు సేవ చేశారని ఆయన గుర్తుచేసుకొన్నారు. ఆయన ఏ పదవిని అలంకరించినా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు.

శతజయంతి ఉత్సవాల సభలో శైలజానాథ్ సమైక్య రాష్ట్రమే కావాలంటూ నినదించారు. సంజీవరెడ్డి సేవలను కొనియాడిన శైలజానాథ్ తెలుగువారైన సంజీవరెడ్డి శతజయంతి సభలో మాట్లాడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ప్రసంగం మధ్యలో ఆయన సమైక్యాంధ్ర గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే శక్తి రాష్ట్రపతికి ఉందని తెలిపారు. ప్రసంగాన్ని కూడా జై సమైక్యాంధ్ర, జైహింద్ అంటూ ముగించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.