అనధికార లే అవుట్లపై నారాయణ ఆగ్రహం

గుంటూరు, జనవరి 30: కొత్త రాజధానిలో వేసిన అనధికార లే అవుట్లపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతిలో అక్రమంగా వేసిన లే అవుట్లను తొలగించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ తో కలిసి వీటిని స్వయంగా పర్యవేక్షించారు. లే అవుట్లలో వేసిన రాళ్లను, చిన్నపాటి గుడిసెలను ప్రొక్లెయిన్లతో తొలగించారు.

క్రిష్ణా, గుంటూరు మధ్య రాజధాని కట్టాలని నిర్ణయించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా 30 వేల ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. ఈ నెలాఖరుకు వరకు 10 వేల ఎకరాలు సమీకరించాలని అనుకున్నది ఇప్పటికే 9,400 ఎకరాలు అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు.

ఎక్కడైతే రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలని గుర్తించామో దాని చుట్టుపక్కల అనుమతి లేకుండా లే అవుట్లు వేసి ప్రజలను మోసగిస్తున్నారనే పిర్యాదులు రావడంతో అధికారులతో సమీక్షించి వీటిని పరిశీలించడం జరిగిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి మండలంలోని అమరావతి 36, ధరణికోటలో 37, వైకుంఠపాళిలో 8, 14వ కిలోమీటరు దగ్గర 7, మొత్తం 88 అనధికార లే అవుట్లను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి నారాయణ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.