అనుమతులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా : కేసీఆర్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ పారిశ్రామిక విధానం సిద్ధంగా ఉందని, తమది ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా తసుకోరాబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్ గ్లాస్ పరిశ్రమను సందర్శించారు, అక్కడ అదనపు ప్లాంటు ప్రాంభించిన అనంతరం మాట్లాడుతూ పెట్టుబడిదారులు నేరుగా తమ కార్యాలయానికి రావచ్చని, అనుమతులు సీఎంవో నుంచి ఒకేసారి పొందవచ్చన్నారు. పరిశ్రమలకు ఇచ్చే అనుమతులను తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానన్నారు.

ఇటువంటి ఫ్యాక్టరీల స్థాపనవల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటికే 165 మందికి స్థానికులకు ఉద్యోగాలు కల్పించినట్లు కోజెంట్ యాజమాన్యం తెలిపిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరో 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అందులో స్థానికులకు 75 శాతం ఇచ్చేందుకు జనరల్ మేనేజర్ ఫెడ్రిక్ హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు.

జిల్లాలో 34,184 ఎకరాల భూమి పరిశ్రమల కోసం గుర్తించామని కేసీఆర్ అన్నారు.  అందులో 13,500 ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉందని తెలిపారు. దీనివల్ల సుమారు 50 నుంచి 80 వేల రూపాయల పెట్టుబడులు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా పచ్చని పంటలతో తులతూగాలని, ఏడు లక్షల ఎకరాల్లో వరి కోతలు కోయాలని దీని వల్ల  పాలమూరు నుంచి ఇతర రాష్ర్టాలకు వలసలు పూర్తిగా ఆగిపోతాయని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

జిల్లాలో తాగు నీటి సమస్యను కూడా రానున్న నాలుగేళ్లలో పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం, తండాల్లోని ప్రతి ఇంటికి మంచి నీరందించే విధంగా తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆ ఘనత మహబూబనగర్ జిల్లాకే దక్కుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాప్రతినిదులంతా కృషిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని, పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, శాసన సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కోజెంట్ గ్లాస్ సంస్థ జనరల్ మేనేజర్ ఫెడ్రిక్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.