అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం : తుమ్మల

tummala-kusumanchi-19

ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 19: జిల్లాలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో సోమవారం ఆయన పర్యటించారు. ముందుగా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలేరు నియోజవర్గంలో రహదార్ల అభివృద్ధికి రూ 4.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట, హైదరాబాద్ రహదారి కలిపే విధంగా కూసుమంచి మీదుగా నేషనల్ హైవేకు రోడ్డు నిర్మిస్తామన్నారు. మంచి రహదార్ల సౌకర్యం వల్ల జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు.

తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరును ప్రతి అవాసమునకు అందించుటకు, ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తుమ్మల స్పష్టం చేశారు. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలు, అదే విధంగా నాగార్జునసాగర్ పై భాగాన ఉన్నవారికి సాగునీరు అందిస్తామన్నారు.

అనంతరం కూసుమంచి జిల్లా పరిషత్ హైస్కూల్ లో రూ 13 లక్షల వ్యయంతో చేపట్టనున్న రెండు అదనపు గదలు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిఇఓ కె.రవీంద్రనాధ్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.