అమానుషం…

darunam-11

వరంగల్, డిసెంబర్ 11: చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలపై అరాచకాలకు కళ్లెం పడటం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా దేశంలో మహిళకు భద్రత కరువైపోతుంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అయినవోలు గ్రామంలో ఓ దారుణం జరిగింది. మూగయువతిపై కొంతమంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలుపుతున్నారు.

మానవ మృగాలను ఎదుర్కోలేని నిస్సహాయత, కాపాడమని కేకలు వేయలేని దుస్థితి. అయినా ఆమె వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ప్రయోజనం ఉన్నా లేకపోయినా కనీసం కనికరిస్తారేమో అనే చిన్న ఆశతో తనను ఏమీ చేయవద్దని వారి కాళ్లా వెళ్లా పడింది. అయినా వారి మనస్సు కరగలేదు. యువతి నిస్సహాయతను అలుసుగా తీసుకొన్న ఆ మృగాలు జంతువులకన్నా హీనంగా బరితెగించారు. కామంతో కన్ను మిన్ను కానకుండా అభాగ్యురాలి జీవితంతో చెలగాటమాడారు. తీవ్రగాయాలతో అచేతనంగా పడి ఉన్న మూగయువతి వేదన అరణ్య రోదనే అయింది. ఈ దారుణం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆ యువతి ఇంటి దగ్గర గుమ్మిగూడారు. బాధితురాలి దైన్యాన్ని చూసి ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు.

అభం శుభం తెలియని అమాయకురాలిపై ఇంత దారుణం జరగడం అందరిని కలచివేసింది. కన్నీరు తప్ప మరో భాష తెలియని నిస్సహాయరాలిని ఇంత దారుణానికి ఒడిగట్టడానికి వారికి మనసెలా వచ్చింది. అసలు వాళ్లు మనుషులేనా, మానవమృగాలా అని ప్రతి ఒక్కరు తల్లడిల్లి పోతున్నారు. ఇంత నీచానికి తెగబడిన ఆ మానవ మృగాలను బహిరంగంగా ఉరితీయాని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.