అమిత్ షాను నిర్దోషిగా తేల్చడం వెనుక కథ ఏమిటి?

సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించగలదా?

మూడు హత్యల మిస్టరీ తేలకుండానే కేసు ముగిసిపోతుందా?

సోహ్రాబుద్దీన్, కౌసర్ బీ, ప్రజాపతి ఎన్ కౌంటర్ల వెనుక హస్తం ఎవరిది?

సీబీఐ కోర్టు తీర్పులో లోపం ఏమిటి?

Amit Shah-4

అమిత్ షా (పాత చిత్రం)

(కాశీనాధ్)

ధిల్లీ, జనవరి 4: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అత్యంత ప్రతిభాశాలి. మరెంతో శక్తిమంతుడు. ఈ దేశంలో ఈ రోజు ప్రధాని నరేంద్రభాయ్ మోదీ తర్వాత అంతటి బలమైన వ్యక్తి అమిత్ షా. ఆయనను గుజరాత్ ఎన్ కౌంటర్ల కేసులో నిర్దోషిగా సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇది న్యాయవ్యవస్థకూ, మేధావులకూ, రాజకీయ పరిశీలకులకూ ఆశ్చర్యం కలిగించింది.

గుజరాత్ లో 2005-06లో సోహ్రాబుద్దీన్ నూ, అతని భార్య కౌసర్ బీనీ పోలీసులు బస్సులో నుంచి బలవంతంగా దించి ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఎన్ కౌంటర్ చేశారనే ఆరోపణలకు సంబంధించిన తీవ్రమైన కేసులో అమిత్ షా నిర్దోషి అంటూ సీబీఐ న్యాయస్థానం నిర్ణయించడం వెనుక రాజకీయ కోణం ఉన్నదా? సీబీఐ డైరెక్టర్ గా యూపీఏ ప్రభుత్వం నియమించిన రంజిత్ సిన్హా ను తొలగించి ఎన్ డీ ఏ సర్కార్ ఎంపిక చేసిన వ్యక్తిని నియమించిన తర్వాత వచ్చిన మొదటి పెద్ద సంచలన తీర్పు ఇది కావడం విశేషం. ఈ తీర్పు అధికార పార్టీ అధ్యక్షుడు, ప్రధానికి అత్యంత సన్నిహితుడు అమిత్ షా కు అనుకూలంగా వచ్చింది కనుక సీబీఐ ఏదో మతలబు చేసిందని అనుమానించేందుకు ఆస్కారం ఉన్నది.

ఒకసారి కేసు పూర్వాపరాలను పరిశీలిద్దాం. సోహ్రాబుద్దీన్ ఒక రౌడీ. అతని భార్య కౌసర్ బీ. సోహ్రాబుద్దీన్ కు గుజరాత్ రాజకీయ నాయకులతో, పోలిసు ఉన్నతాధికారులతో నేర సంబంధాలు ఉండేవి. గుజరాత్ మారణహోమం తర్వాత సోహ్రాబుద్దీన్ అంతవరకూ అతడిని పోషించి వినియోగించుకున్న రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ ఇబ్బందికరంగా పరిణమించాడు. అతడిని అడ్డు తొలగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  అతడిపైన కేసులు ఉన్నాయి కనుక పోలీసులు అతడిని అరెస్టు చేయవలసి వచ్చిందంటూ సీబీఐ న్యాయమూర్తి సమర్థించారు. అరెస్టు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండేది కాదు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిని పట్టుకొనిపోయి కాల్చి చంపారు బూటకపు ఎన్ కౌంటర్ లో. న్యాయమూర్తి ఉపయోగించిన పదజాలం సూచించే అర్థం సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ నిజమైనదనీ, బూటకపుది కాదనీ. బస్సులో ప్రయాణిస్తున్న సోహ్రాబుద్దీన్ నూ, అతని భార్యనూ అపహరించి ఎన్ కౌంటర్ చేశారని నిర్ధారించింది సీబీఐ కాదు. గుజరాత్ సీఐడీ. ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారన్న ఆరోపణపైన డీజీ వన్జారా, రాజ్ కుమార్ పాండియన్, ఎంఎన్ దినేశ్ వంటి పోలీసు అధికారులను  సీఐబీ అరెస్టు చేసింది కూడా.  దర్యాప్తును తప్పు దారి పట్టించే కుట్ర జరుగుతున్నదంటూ స్పష్టం చేస్తూ,  ఈ నేరానికి గల రాజకీయ పార్శ్వాన్ని వెల్లడించిన రజనీశ్ రాయ్, వీఎల్ సోలంకీ కూడా గుజరాత్ కేడర్ కు చెందిన పోలీసు అధికారులే. ఈ మాత్రం చలనం రావడానికి కొన్ని ఇంగ్లీషు చానళ్ళు చేసిన పరిశోధన కూడా కారణం.

ఈ కారణంగానే, గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులూ, ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నదనే ఈ కుట్ర కేసు దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు 2010లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది.

2006 డిసెంబర్ లో అమిత్ షా హోంమంత్రి హోదాలో ఒక సమావేశం ఏర్పాటు చేశారనీ, గుజరాత్ డీజీపీ పీసీ పాండే, ఏడీజీపీ, సీఐడీ జిసి రాయ్ గార్, సీ ఐడీ డీజీపీ గీతా జోహ్రీ(అప్పుడు ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రధాన అధికారి) నాటి సమావేశంలో పాల్గొన్నారనీ సుప్రీంకోర్టు ముందు సాక్ష్యం చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న దర్యాప్తు నివేదికను మార్చవలసిందిగా షా ఒత్తిడి చేశారని తెలిసింది. ఈ నివేదికను రూపొందించిన అధికారి గీతా జోహ్రీ నాయకత్వంలో పని చేస్తున్న సోలంకీ. ఈ విషయంలో మంత్రి సూచించినట్టు సహకరించేందుకు సోలంకీ నిరాకరించారు. పైగా సోహ్రాబుద్దీన్, కౌసర్ బీల అపహరణకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రజాపతి అనే పౌరుణ్ణి తాను ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదని  సోలంకీ సూచించారు. తనకు చాలా సమాచారం తెలుసు కనుక పోలీసులు తనను చంపబోతున్నారంటూ 2006 నవంబర్ లో  ప్రజాపతి కోర్టులో పెద్దగా కేకలు వేశాడు. అతడు సోలంకీతో మాట్లాడటానికి కొద్ది రోజుల ముందే ఎన్ కౌంటర్ అయిపోయాడు. అతడు భయపడినంతా జరిగింది. 2007 ఏప్రిల్ లో  గీతా జోహ్రీని పక్కకు తప్పించి ఈ కేసు దర్యాప్తు బాధ్యతను రజనీశ్ రాయ్ కి అప్పగించారు. అప్పుడు కొన్ని అరెస్టులు జరిగాయి. కానీ నెలరోజులు తిరగకుండానే  రాయ్ ని బదిలీ చేశారు. గీతాజోహ్రీని తిరిగి ఆయన స్థానంలో నియమించారు. అంతే. మూడేళ్ళపాటు దర్యాప్తు అటకెక్కింది. మూడు హత్యలనూ కలిపి దర్యాప్తు చేయడంలో విఫలమైనందుకు ఆమెనూ, ఇతర గుజరాత్ పోలీసు అధికారులనూ సుప్రీంకోర్టు గట్టిగా మందలించిన తర్వాతనే దర్యాప్తు కాస్త కదిలింది.

రాయ్ గార్ సాక్ష్యం, ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల టెలిఫోన్ సంభాషణల రికార్డర్ లోని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో షాను ముద్దాయిగా చేర్చుతూ సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఆయనతోపాటు గీతాజోహ్రీనీ, పాండేనీ ముద్దాయిల జాబితాలో చేర్చారు. మూడు హత్యలు జరగడానికి ముందూ, జరిగిన తర్వాతా సీనియర్ పోలీసు అధికారులతో అమిత్ షా టెలిఫోన్ ద్వారా సంపర్కంలో ఉన్నట్టు రికార్డర్లు నిరూపించాయి. కానీ సీబీఐ కోర్టుకు ఇది అసాధారణంగా కనిపించలేదు. ఉగ్రవాదుల ప్రమాదం పొంచి ఉన్న సమయంలో హోంమంత్రి పోలీసు అధికారులతో సంపర్కంలో ఉండటం సాధారణమేనంటూ కోర్టు భావించింది. పైగా అమిత్ షాతో పోలీసు ఉన్నతాధికారులు జరిపారంటున్న సమావేశం అసలు జరగనేలేదంటూ జోహ్రీ, పాండేలు ఇచ్చిన వాజ్ఞ్మూలాన్ని సీబీఐ కోర్టు విశ్వసించింది. వీరిద్దరూ షా తో పాటు నిందితులైనప్పటికీ వారి సాక్ష్యానికి కోర్టు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం అసాధారణం.

ఈ కేసు భవిష్యత్తు ఏమి కాబోతున్నది? అంతా సీబీఐ వైఖరిపైన ఆధారపడి ఉంటుంది. సీబీఐ రాజకీయ నాయకత్వం అభిమతానికి భిన్నంగా వ్యవహరిస్తుందా లేక మోకరిల్లుతుందా అన్నది ఈ కేసు తుది పరిష్కారం తీరులో తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు సీబీఐకే దర్యాప్తు బాధ్యత అప్పగించింది కనుక సీబీఐ సమర్పించే సాక్ష్యాధారాలపైనే కేసు మనుగడ ఆధారపడి ఉంటుంది.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న కేసును మన ఇంగ్లీషు ఛానళ్ళూ, అర్నాబ్  గోస్వామి, బర్ఖాదత్, రాజ్ దీప్ సర్దేశాయ్ వంటి టీవీ ఉద్దండులు ఎందుకు పట్టించుకోలేదో తెలుసుకోవాలంటే మీడియా ఎవరి ఆధిపత్యంలో ఉన్నదో, వారి వెనుక ఎవరున్నారో, వారి జేబులో ఎవరున్నారో  తెలుసుకోవాలి. అది మరో పెద్ద కథ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.