అలెగ్జాండర్ ను భయపెట్టిన మన ఆర్చెరీ

భాస్కరం కల్లూరి

రియో ఒలింపిక్స్ ముగిశాయి. ఆరు పతకాలను గెలుచుకున్న లండన్ ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కనీసం ఆ అంకెకు ఒకటైనా అదనంగా చేర్చగలమని ఆశ పెట్టుకున్నాం. దానికి ముందు 2008లో చైనా ఒలింపిక్స్ లో గెలుచుకున్న మూడు పతకాలు 2012 ఒలింపిక్స్ లో రెట్టింపు అయ్యాయి కనుక, మన దశ మారి ముందుకే వెడుతున్నామని అనుకున్నాం. కానీ రియో లో మన పతకాల లెక్క రెండుకు, అంటే లండన్ పతకాలలో మూడో వంతుకు తగ్గి దేశం మొత్తాన్ని నిరాశ పరిచింది. అన్ని రంగాల్లో దేశం ముందుకే వెడుతోందని పాలకులు నమ్మిస్తున్నారు. ఆ అన్ని రంగాలలో ఒలింపిక్ క్రీడలు మాత్రం లేవు.

క్రీడల్లో మనం వెనక్కి పరుగెత్తడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాం

మన ఫలితాల తీరు చూసి ఈసారి ఒక్క పతకం కూడా రాదేమోనని మొదట ఆందోళన చెందాం. కనీసం రెండైనా వచ్చినందుకు ఊపిరి పీల్చుకున్నాం. ఆ రెండూ అబ్బురపరచినవే. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ గెలిచిన కాంస్యం మన కళ్ళల్లో కొత్త ఆశల కాంతి నింపింది. ఆ తర్వాత మన తెలుగమ్మాయి భారత ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారి బ్యాడ్ మింటన్ లో ఫైనల్స్ కు చేరి దానికి రజత కాంతులు అద్దింది. పతకం తీసుకురాకపోయినా దీపా కర్మాకర్ అనే మరో అమ్మాయి సాధించిన ఘనతా తక్కువది కాదు. ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీప. అంతేకాదు, తను నాలుగవ స్థానంలో నిలవడం మరో అద్భుతం.

ముగ్గురికీ అభినందనలు

మరీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మన క్రీడాకారులు వ్యక్తిగత స్థాయిలో ఎదుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సత్తాను క్రమంగా పుంజుకుంటున్నారు. కానీ లోటల్లా ఒకటే, వారికి వ్యవస్థాగతమైన మద్దతు ఉండవలసినంతగా లేదు. శిక్షణ క్రమంలోనే రకరకాల ‘హర్డిల్స్’ ను దాటవలసివస్తోంది. తీరా అసలు ఆట దగ్గరికి వచ్చేసరికి అలసిపోతున్నారు.

అత్యధిక జనాభా గల దేశం. అందులోనూ యువ జనాభా ఎక్కువ ఉన్న దేశం. అయినా సరే, ఆటల్లో మేటిగా ప్రపంచస్థాయిలో కనీసమైన గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోతోంది. ఎందువల్ల? మన క్రీడా సంస్కృతికి, స్ఫూర్తికి ఎప్పుడో, ఎక్కడో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు దాని నుంచి కోలుకోలేక సతమతమవుతోంది.

Kalluri Bhaskaram

భాస్కరం కల్లూరి

మల్లయుద్ధం, విలువిద్య, బంతాట, పరుగుపందెం వగైరాలు మనకు తెలియనివి కావు. నలంద, తక్షశిల విద్యార్థులు వీటిలో ఆరి తేరారని చైనా యాత్రికులు హ్యూయాన్ సాంగ్, ఫాహియాన్ రాశారు. 16వ శతాబ్దిలో విజయనగరసామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ వర్తకులు, రాయబారులు అక్కడి క్రీడా విన్యాసాలను చూసి ముగ్ధులయ్యారు. వియజయనగరంలో ప్రతిచోటా వాళ్ళకు ప్రత్యేకంగా ఆటస్థలాలు, క్రీడా సంరంభం కనిపించాయి. స్వయంగా కృష్ణదేవరాయలు మల్లయోధుడు, ఆశ్విక నిపుణుడు. ఇప్పటి కాలానికి వస్తే, రోడ్లు, సందులే మన పిల్లలకు ఆటస్థలాలు. మొగల్ చక్రవర్తులు కూడా ఆటలను, ముఖ్యంగా కుస్తీపోటీలను ప్రోత్సహించేవారని చరిత్ర చెబుతోంది. షాజహాన్ కాలంలో ఆగ్రా కోటలో, ఎర్రకోటలో కుస్తీపోటీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి. హర్యానా, ఉత్తరప్రదేశ్ మొదలైన చోట్ల కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కుస్తీపోటీల వారసత్వాన్ని పరిరక్షించుకుంటున్నాయి. ఇక్కడి కుస్తీవీరులు చాలావరకూ వ్యక్తిగత ప్రయత్నంతో రాణిస్తూ ఆసియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ లలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. వీళ్లను కదిపితే ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, అధికారుల నిర్వాకాల గురించి ఎన్నో విషయాలు చెబుతారు.

మహాభారత కాలానికి వెడితే నేటి జావలిన్ త్రో, డిస్కస్ త్రో వగైరాలతో పోలిక కలిగిన ఎన్నో ప్రావీణ్యాలు కనిపిస్తాయి. బల్లెం, చక్రం ఇలాంటివే. భీముడు గొప్ప మల్లయోధుడు. అజ్ఞాతవాస కాలంలో వలలుని పేరుతో ఉన్నప్పుడు శత్రు గూఢచారిగా వచ్చిన ఒక మల్లయోధుని చంపుతాడు. కీచకునితో మల్లయుద్ధం చేసి సంహరిస్తాడు. కృష్ణుని వధించడానికి చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులను కంసుడు ప్రయోగిస్తాడు. వీరు ఆంధ్రులని అంటారు. బుద్ధుని కాలంలో నేటి ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దులలో మల్లుల పేరుతో ఒక తెగ ఉండేది. వాళ్లలో మల్లబంధురుడు అనే ఒక వీరుడి గురించి రాహుల్ సాంకృత్యాయన్ తన ‘వోల్గా సే గంగ’లో విశేషంగా రాస్తాడు. మల్లబంధురుడు గొప్ప కత్తి వీరుడు కూడా. వరసగా పాతిన ఏడు రాటల్ని ఒక్క వేటుతో నరకుతాడు.

విలువిద్య సరే సరి. రాముడి శివధనుర్భంగం, అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించడం విలువిద్యా ప్రదర్శనలే

ఇంకా చెప్పాలంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ను కూడా భయభ్రాంతం చేసిన విలువిద్యా లాఘవం మనది. పోరస్(పురుషోత్తముడు)తో అలెగ్జాండర్ యుద్ధం గురించిన విశేషాలను నమోదు చేసిన ఆరియన్ అనే చరిత్రకారుడి ప్రకారం, భారతీయ ధనుస్సు ఆరడుగుల పొడవు ఉంటుంది. దానికి తగిన పొడవు, పదును కలిగిన బాణం శత్రువు డాలునూ, కవచాన్నీ కూడా చీల్చివేస్తుంది. అది అలెగ్జాండర్ స్వయంగా ఎదుర్కొన్న అనుభవం కూడా. ఒక మల్ల విలుకాడు మూడువేళ్ళ వెడల్పు ఉన్న మొనతో ఒక బాణాన్ని అతని మీద ప్రయోగించినప్పుడు అది అతని కవచాన్నిచీల్చుకుంటూ వెళ్ళి పక్కటెముకకు గుచ్చుకుపోయింది. అతి కష్టం మీద దానిని తీయగలిగారట. అలెగ్జాండర్ తన యుద్ధజీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద గాయం అదే నంటారు.

అలెగ్జాండర్ పోరస్ మీదికి యుద్ధానికి వచ్చింది వర్షాకాలంలో. వర్షం పడుతున్నప్పుడు విలువిద్యా పాటవం మంచి ఫలితాలను ఇవ్వదు. పోరస్ ఓడిపోవడానికి అదే కారణమని, ఇతర కాలాలలో అయితే విలుకాళ్లతోనే యుద్ధం గెలిచి ఉండేవాడనీ అంటారు. అదీగాక ఉన్న బలాన్నీ, నేర్పునూ ఒడుపుగా వాడుకోలేకపోవడం, తగిన వ్యూహ నైపుణ్యం లేకపోవడం కూడా పోరస్ పరాజయానికి ఒక కారణం. ఉదాహరణకు, పోరస్ ది గజబలమైతే, అలెగ్జాండర్ ది ఆశ్విక బలం. గజసైన్యాన్ని సక్రమంగా నడిపించకపోతే అది శత్రు సైన్యాన్ని నిర్జించే బదులు సొంత సైన్యాన్ని మట్టుపెడుతుంది. ఇలాంటి నిర్వహణ లోపమే రకరకాల రూపాల్లో మన క్రీడా ప్రయత్నాలను ఇప్పటికీ దెబ్బతీస్తూ పోటీ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నా ఆశ్చర్యంలేదు.

విలువిద్య అసలు ఏకలవ్యుడి లాంటి అడవిపుత్రులది, గిరిజనులది. అలాంటిది, గిరిజనేతరులు అందులో గురువులుగా మారి యుద్ధాలకు ఉపయోగించే మారణాస్త్రంగా దానిని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ అడవిపుత్రులలోని విలుకాళ్లను గుర్తించి  సానబడితే వారు పతకాలు తెచ్చే అవకాశం ఉండచ్చు. ఆ ప్రయత్నమే లేదు.

గ్రీస్ లో ఒలింపిక్స్ ప్రారంభకాలాన్ని క్రీ.పూ. 776గా నిర్ణయించారు. నేడు పరుగుపందేనికి పర్యాయపదంగా మారిన ‘మారథాన్’ అనే మాట వెనుక ఒక చరిత్ర ఉంది. అది గ్రీస్ లోని ఒక ప్రదేశం.  క్రీ.పూ. 500 ప్రాంతంలో పర్షియన్లకు, గ్రీకులకు అక్కడే తొలియుద్ధం జరిగింది. ఫిలిప్పైడ్స్ అనే పరుగువీరుడు అందులో  గ్రీకుల తరపున ఒక ముఖ్యపాత్ర పోషించాడు. గ్రీస్ లోనే స్పార్టా, ఎథెన్స్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. స్పార్టాన్లు భూయుద్ధంలో నిపుణులు. ఎథీనియన్లు నౌకాయుద్ధంలో నిపుణులు. పర్షియన్లు హఠాత్తుగా వచ్చిపడడంతో ఎథీనియన్లకు స్పార్టాన్ల సాయం అవసరమైంది. సమయం తక్కువగా ఉండడంతో పరుగువీరుడైన ఫిలిప్పైడ్స్ ద్వారా స్పార్టాన్లకు కబురు పంపారు. అతను కొండలు, గుట్టల వెంట 150 మైళ్ళ దూరంలో ఉన్న స్పార్టాకు ఒక్కరోజులో వెళ్ళి కబురు అందించాడు. పౌర్ణమి తర్వాత, అంటే వారం రోజులకు కానీ తాము రాలేమని వాళ్ళు చెప్పారు. ఫిలిప్పైడ్స్ ఆ కబురు తీసుకుని అంతే పరుగు పరుగున ఎథెన్స్ కు, అక్కడినుంచి మారథాన్ కు వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు. స్పార్టాన్లు వచ్చే లోపలే యుద్ధం ముగిసి, ఎథీనియన్లు గెలిచారు. మళ్ళీ ఆ గెలుపు వార్తను ఫిలిప్పైడ్సే ఎథెన్స్ కు మోసుకెళ్లి తీవ్ర ఉద్వేగంతో చేతిలోని డాలు విసిరేసి “మనం గెలిచాం” అంటూ పెద్ద కేకపెట్టి హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. అప్పటినుంచి మారథాన్ పరుగుల పోటీకి పర్యాయపదమైంది.

ఒక విధంగా చూస్తే మన రామాయణంలోని హనుమంతుడు కూడా మంచి వేగంగా ప్రయాణించగలిగినవాడే. కాకపోతే, ఫిలిప్పైడ్స్ భూమార్గంలో వేగంగా వెళ్లగలిగితే హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. వేగంలో ఇద్దరి మధ్యా పోలిక ఉంది. ఆవిధంగా మనకు హనుమంతుడు ఒక రోల్ మోడలే.

అలెగ్జాండర్ దండయాత్ర ద్వారా మనకు గ్రీకులతోనే కాక, వాళ్ళ ఒలింపిక్ క్రీడలతోనూ అతి పురాతన కాలంలోనే పరిచయం ఉందని మహాభారతంలోని ఒక ఘట్టాన్ని చూస్తే లీలగా అనిపిస్తుంది. కర్ణుని రథసారథి అయిన శల్యుడు యుద్ధమధ్యంలో కర్ణుని స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అడుగడుగునా దుర్భాషలాడతాడు. అలాంటి సందర్భంలోనే ఒక కథ చెబుతాడు. అందులో ఒక కాకి, హంస ఎగరడంలో పోటీ పడ్డాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో విన్యాసాలు మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, “ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి?” అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది. పరుగు పందెంలో పాటించే ఒక ముఖ్యసూత్రాన్ని ఈ కథ వెల్లడిస్తుంది. ఒలింపిక్స్ లో చూసే ఉంటారు, ముందే వేగంగా పరుగెత్తినవారి కన్నా పరుగులో వెనకబడిన వారిలోనే ఒకరు అంతిమంగా ముందుకొచ్చి పతకం గెలుచుకుంటూ ఉంటారు. అంటే సమగతిలో మొదట పరుగెత్తి, తద్వారా శక్తిని కాపాడుకుంటూ చివరి అంచెల్లో దానిని ఒడుపుగా వాడుకుంటారన్నమాట. కాకి-హంసల పరుగులో కనిపించినది ఆ తేడాయే.

విశేషమేమిటంటే శల్యుడు మద్రదేశస్థుడు. మద్రదేశం గ్రీకుల ప్రభావ పరిధిలోని ప్రాంతం. ఈ వివరాన్ని అలా ఉంచి అసలు విషయానికి వస్తే గ్రీకుల పరిచయం ద్వారా మనకు అతి ప్రాచీనకాలంలోనే ఒలింపిక్స్ తో పరిచయం ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రకరకాల క్రీడలలో మనం తగినంత నైపుణ్యం ఉన్న వాళ్ళమే. అయినా మనల్ని పతకాల దారిద్ర్యం ఎందుకు వెంటాడుతోంది? ఈ దుస్థితిని ఎప్పటికీ చక్కదిద్దుకోగలుగుతాం?

ఒలింపిక్స్ వచ్చి వెళ్ళిన ప్రతిసారీ వేసుకునే ప్రశ్నలే ఇవి. ఈ ప్రశ్నలు వేసుకోనవసరం లేని రోజు కోసం ఆశతో ఎదురుచూద్దాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.