అవసరం మేర మార్పులు : హరగోపాల్

haragopal-9

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడే భారీగా మార్పులు ఉండకపోవచ్చు, తర్వాత కాలంలో అవసరం మేర మార్పులు వచ్చే అవకాశం ఉందని కమీషన్ నిపుణుల కమిటీ చైర్మన్ ఆచార్య హరగోపాల్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రణాళిక, పాఠ్యంశాల రూపకల్పనపై 25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో శుక్రవారం తొలి భేటీ జరిపింది. ఈ సమావేశంలో రాతపరీక్ష, సిలబస్‌పై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం ఆచార్య హరగోపాల్ మీడియాకు సమావేశ వివరాలు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయల తదితర అంశాలు పాఠ్యాంశాల్లో ఉండాలని ప్రభుత్వం భావించిందని, ఈమేరకు ఉద్యోగ పాఠ్యాంశాలలో కూడా స్వల్ప మార్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు. సాధారణంగా ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాల లోపు పరీక్షల ప్రణాళిక, సిలబస్‌పై సమీక్ష, సిలబస్‌లో మార్పులు చేర్పులు జరగడం ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు.

తమ కమిటీ సిలబస్‌లోని మార్పులను మాత్రమే సూచిస్తుంది తప్ప ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆచార్య హరగోపాల్ స్పష్టం చేశారు. పరీక్షల పాఠ్యాంశాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ సూచనలు చేయడం మాత్రమే కమిటీ బాధ్యతని, తుది నిర్ణయం సర్వీస్ కమీషన్దే అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సీ విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్‌ఖాద్రీ, ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ మల్లేశంతో పాటు కమిటీ సభ్యులు హజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.