అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం

అభినయ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. సభను అడ్డుకొనేందుకు విపక్షాలు సిద్దమైతే, ప్రతిపక్షాలను  కట్టడిచేసేందుకు ప్రభుత్వం వ్యూహారచన చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ఈ నెల 11న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బడ్జెట్ కు ప్రభుత్వం తుదిరూపుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడ శనివారం నుండే ప్రారంభమౌతున్నాయి. ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ నేడు ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎప్పటివరకు సభను నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ నెల 8,9,10 తేదిల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ కొనసాగనుంది. అదే విధంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 11న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 మాసాలకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు గత బడ్జెట్ లో ప్రతిపాదించిన దానిలో 65 శాతం నిధులను ఖర్చు చేసినట్టు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయానికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు వచ్చే నిధుల విషయంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటాల్లో 36 నుండి 42 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం నుండి వివిధ పధకాల ద్వారా రాష్ట్రాలకు వచ్చే నిధులు భారీగా తగ్గిపోయాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొంటూ ప్రభుత్వం బడ్జెట్ పై కసరత్తు చేస్తోంది.

ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. తెలంగాణ తాగు నీరు ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, హారితహారం, కేజీ టూ పీజీ విద్యకు బడ్జెట్ లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. గత బడ్జెట్ లో ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయని భావించిన నిధులు రాలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సర్కార్ బడ్జెట్ లో ఆయా శాఖలకు నిధులను కేటాయించే అవకాశం ఉంది.

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజున సభకు సెలవు ఇవ్వనున్నారు. ఈ నెల 13,14,16 తేదిల్లో బడ్జెట్ పై చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 17న, బడ్జెట్ పై ప్రభుత్వం సమాధానం తెలపాల్సి ఉంది. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఈ నెల 21,22 తేదిల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. అయితే శనివారం జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాల తీరుతెన్నుల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది.

బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు విపక్షాలు సన్నద్దమయ్యాయి. పార్టీ ఫిరాయింపులకు అధికారపార్టీ ప్రోత్సహిస్తోందని విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించి, ప్రస్తుతం అధికార పార్టీలో చేరిన సభ్యులపై అనర్హత వేటు వేయాలని గతంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై స్పీకర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీచేసింది. ఈ విషయమై ప్రభుత్వాన్నినిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధం అయ్యాయి. సచివాలయ తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఆకాశ హార్మ్యాల నిర్మాణం చేయాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై విపక్షాలు సమరానికి సిద్ధమవున్నాయి. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు విపక్షాలు వ్యూహారచన చేస్తున్నాయి. అయితే విపక్షాలకు ముకుతాడు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా శాఖలకు సంబందించి మంత్రులు సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విపక్షాలను ఎండగట్టేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.