ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Central-cabinet

తెలంగాణ బిల్లు కోసమే ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. మంత్రుల బృందం చేసిన సిఫార్సులను యధాతధంగా ఆమోదించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు అభ్యంతరం తెలిపినా కేబినెట్ మాత్రం బిల్లును ఆమోదించి రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేసింది. ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు రెండుగంటల పాటు సాగింది.

హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, హైదరాబాద్ లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉండేలా జీవోఎం చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులను కేంద్రమే కేటాయించాలని.. అవసరమైతే రాజధాని కోసం అటవీ అనుమతులు కూడా లభించేలా చూడాలని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది. సీమాంధ్రలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

అయితే రెండు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో కావూరి సాంబశివరావు అరగంట, మరో మంత్రి పళ్లంరాజు పదిహేను నిమిషాలు మాట్లాడారు. విభజన జరిగితే తలెత్తే సమస్యలను కేబినెట్ కు వివరించినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు బిల్లును సీమాంధ్ర కేంద్రమంత్రులైన కావూరి సాంబశివరావు, పళ్లంరాజు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల్సిందేనని ఇద్దరు మంత్రులూ పట్టుబట్టారని అయితే కేబినెట్ మాత్రం హైదరాబాద్ ను యూటీ చేయడానికి ససేమిరా అంగీకరించలేదని చెబుతున్నారు. దీనిని తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తప్పుపట్టడమే కాకుండా హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలోకి తేవడం పైన కూడా జైపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం కానున్నట్లు సమాచారం. భద్రాచలం రెవెన్యూ డివిజన్ లోని 8మండలాల్లో 4 మండలాలు, పాల్వంచ డివిజన్ లోని 7 మండలాల్లో 3 మండలాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. భద్రాచలం గ్రామం తెలంగాణలోనే కొనసాగనుంది.

అటు 294 పేజీలతో కూడిన బిల్లులో 32 సవరణలు చేసింది. నియోజకవర్గాల సంఖ్యపై కీలక ప్రతిపాదన చేసింది. ఇరు ప్రాంతాల్లో నియోజక వర్గాల పునర్ విభజనను కేంద్ర మంత్రి వర్గం ప్రతిపాదించింది. శాసనసభ స్థానాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం సీమాంధ్ర ఉన్న 175 శాసన సభ స్థానాలను 225కు, తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 150కు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఎన్నికలు నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత లేదా ముందా అన్నది ఈసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసనసభ వెంటనే రద్దు కానుంది. కొత్తరాజధాని కోసం నిపుణుల నివేదిక గడువు 45 రోజుల నుంచి 6 నెలలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.

కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతికి పంపేందుకు హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటనలో ఉండటంతో బిల్లును త్వరగా పంపాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 12న పార్లమెంట్ కు బిల్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే పార్లమెంటులోనే సవరణలు చేయాలని నిర్ణయించారు. అయితే హడావిడిగా ఎందుకనుకుంటే… ఈ నెల 15వ తేదీ తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.