ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే విద్యుత్ సమస్యలు అనడం సరికాదు : యనమల

హైదరాబాద్, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ వల్లే తమ రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. సమస్యను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరైనటువంటి విధానం కాదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబునాయుడు వల్లే సమస్యలు వస్తున్నాయి అని చెప్పడం వాళ్ల అవివేకమన్నారు. సమస్య ఉంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమీక్షించుకోవాలన్నారు. ఇక్కడ పరిష్కారం జరగకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమస్య పరిష్కరించుకోవాలే తప్పా, శాసనసభను వేదికగా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి అనడం సరైన పద్ధతి కాదని యనమల రామకృష్ణుడు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మిగతా మంత్రి వర్గం, కొంత మంది శాసనసభ్యులు శాసనసభ ద్వారా ప్రజలను తప్పుదారిపట్టించేదుకు ప్రయత్నిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.