ఆంధ్రప్రదేశ్ రాజధాని-చంద్రబాబు చాణక్యం

  • కమిటీ సిఫారసులు బుట్టదాఖలు
  • అంతా తానే నడిపిస్తున్న బాబు

(కెే.వి.ఎన్.ఎల్.నరసింహా రావు)

“గుంటూరు జిల్లాలోనే రాజధాని వస్తుంది. ఉదయం రాజధానికి వెళ్లి పనులుచూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చు. అందుకే ఈ రాజధాని ప్రజా రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు ఒక ఇటుక లేకపోతే ఆ ఇటుక విలువైనటువంటి డబ్బు ఖర్చపెట్టే పరిస్థితి రావాలి. శ్రమదానం చేయాలి. రాష్ట్రంలో ఉన్న 4.93 కోట్ల మందని భాగస్వామ్యం చేసి, మీ శ్రమతో ప్రపంచమే అబ్బురపడే విధంగా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేద్దాం. ఇది కూడా సాద్యం. అసాధ్యమేమి కాదు.“ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా శ్యావల్యాపురంలో జరిగిన సభలో రాజధానిని ప్రకటించి నప్పుడు చెప్పిన మాటలు. ఇది వినడానికి బాగానే ఉంది. గుంటూరు పరిసర ప్రాంతాలవారైతే ఉదయం రాజధానికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చు వారికి బాగానే ఉంటుంది. కాని విశాఖపట్నం, తిరుపతి తదితర దూర ప్రాంతాల వారు రాజధానికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు వెళ్లాలో చెప్పలేదు. అంతేకాదు రాజధాని నిర్మాణంపై సలహాలు, సూచనలు చేసేందుకు మంత్రి నారాయణ అధ్యక్షతన ఒక కమిటి, పత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన ఒక కమిటిని ఏర్పాటు చేశారు. ఇందులో ఓ కమిటి రాజధాని స్థలాని నిర్ధారిస్తే, వ్యవసాయ భూములిచ్చేందుకు రైతులను ఒప్పించే పని మరో కమిటి చేస్తుంది.

గతంలో ఏం జరిగింది?

రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని నియమించింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటి ఆంధ్రప్రదేశ్ లోను అన్ని ప్రాంతాల్లోను పర్యటించి రకరకాల సమాచారాన్ని సేకరించి 187 పేజీల నివేదిక రూపొందించింది. అన్ని ప్రాంతాల్లోను అధ్యయనం చేసిన కమిటి రాజధాని నిర్మాణంకోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. ప్రస్తుతం ఉన్న భూ ధరల ప్రకారం భూ సేకరణ ఆర్ధిక భారంతో కూడుకున్నదని, దీనికి 3 లేక 4 ఏళ్ల సమయం పడుతుందని వివరించింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలలాంటి కీలక నిర్మాణాల ఏర్పాటు వేరు వేరు చోట్ల జరగాలని సూచించింది. శాసనసభ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదని కమిటి స్పష్టం చేసింది. పాలన పరంగా కీలమైన ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు సచివాలయ ఏర్పాటుకు 20 ఎకరాలు అవసరమని కమిటి తెలిపింది. అసెంబ్లీ ఏర్పాటుకు 80 నుంచి 100 ఎకరాలు కావలస్సి ఉంటుందని చెప్పింది. గవర్నర్ నివాస గృహం రాజ్ భవన్ కోసం 15 ఎకరాలు కావాలని చెప్పింది. హైకోర్టు ఏర్పాటుకు విశాఖ నగరాన్ని పరిశీలించవచ్చని నివేదికలో సూచించింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాయలసీమ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. నిర్మాణ ఖర్చు ప్రతిపాదనలు కూడా కమిటి నివేదికలో పొందుపర్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ జోన్ నిర్మాణం కోసం రూ 10519 కోట్లు అవసరమని సూచింది. త్రాగునీరు, మౌలిక వసతులు డ్రైనేజీల నిర్మాణం కోసం రూ 1536 కోట్లు కావల్సి ఉంటుందని తెలిపింది. రాజ్ భవన్ కోసం రూ 56 కోట్లు, సచివాలయానికి రూ 68 కోట్లు, 8 రైల్వే జోన్ల నిర్మాణం కోసం రూ 7035 కోట్లు, అతిథి గృహాల నిర్మాణం కోసం రూ 559 కోట్లు, డైరెక్టరేట్ల నిర్మాణం కోసం రూ 6658 కోట్లు అవసరమని సూచించింది. రాజధాని ఇతర భవన ఏర్పాటుకు రూ 27092 కోట్లు అవసరమని పేర్కొంది. విమానాశ్రాయాల అభివృద్ధికి రూ 10200 కోట్లు, హైకోర్టు సహా న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలకు రూ 1271 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది. భూ సేకరణ ఆలస్యం అయ్యే కొద్ది రాజధాని నిర్మాణం ఆలస్యమౌతుందని కమిటి పేర్కొంది. కేవలం తమవి అభిప్రాయాలు, సూచనలే మాత్రమే అని రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని శివరామకృష్ణ కమిటి చెప్పడం కొసమెరుపు.

A P Capital-14

(పాత చిత్రం)

 

రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని శివరామకృష్ణ కమిటి స్పష్టం చేయడంతో టిడిపి ప్రభుత్వం ఆ కమిటి నివేదికను పూర్తిగా పక్కన పెట్టింది. ఆ కమిటి నివేదిక సమర్పించకముందే (ప్రాధమిక నివేదిక సమర్పించిన తరువాత) చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ప్రయత్నాలు చేసి నివేదికను మార్పించడం,  ఆ నివేదిక చివర్లో కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం. మొత్తం మీద రాజధాని నిర్మాణం ఎక్కడ జరగాలి? ఎంత విస్తీర్ణంలో జరగాలి? అనే విషయం మీద మొదటి నుంచి ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిని ప్రకటించేటప్పుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా, అసలు ప్రతిపక్షం వాణి వినిపించకుండా అధికార పక్షం నిర్ణయం తీసుకుంది. ప్రజానీకం, పౌరసమాజం, చట్ట సభల్లో ఉన్న సభ్యులు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులలో ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పకపోవడం వల్ల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటైంది. కాని రైతులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్లు సమ్మతిస్తున్నట్లు చెప్పి వాళ్ల పొలాలు తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.  ఇటువంటి ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసినప్పుడు ఈ విధంగానే చేశారు. అప్పుడు కూడా దురదృష్టవశాత్తు రైతులతోనే తలపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా రైతులతోనే తలబడుతున్నారు.

ప్రస్తుతం ఏం జరుగుతోంది…

ప్రభుత్వం సేకరించే 30 వేల ఎకరాలలో ఏమి చేయబోతున్నారో విడమరచి చెప్పడం లేదు. ఇది కాకుండా కార్ల రేసింగ్‌కూ, ఇతర వినోదాలకూ ఇంకా భూములు కావాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రూ.1,13,000 కోట్లు అవసరమని అంచనా. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత నిధి? తుళ్ళూరు చుట్టుపక్కల భూముల ధరలు పెంచి రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించి నిధులు సమీకరిస్తారనే మాట ప్రచారంలో ఉండటంతో తుళ్ళూరు మండలం రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజధానికి ఎంపిక చేసిన 29 గ్రామాల్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడి పండని పంటలేదు. ఇన్నాళ్లు కన్నతల్లిగా చూసిన భూమిని రాజధానికి ఇచ్చేందుకు చాలా మంది రైతులు నిరాకరిస్తున్నారు. ఈ మండలంలో ఎకరం, అరెకరం ఉన్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. సాగులో ఉన్న ఒక ఎకరం భూమి ఎనిమిది మందికి ఉపాధిని కల్పిస్తుందని నిపుణుల అంచనా. అంటే ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సేకరించాలనుకున్న 30 వేల ఎకరాల్లో సుమారు 2 లక్షల 40 వేల మంది ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. రైతులు పరిస్థితి ఇలా ఉంటే రైతు కూలీలు, కౌలు రైతుల కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వీరికి ప్రభుత్వం కొత్తగా శిక్షణ ఇచ్చి పనులు కల్పిస్తామంటే నమ్మలేకపోతున్నారు. పంటసాగుతప్ప వేరేపని తెలియని తమకు ప్రభుత్వం ఏ పనిచూపిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు. రాజధాని పేరుతో నాలుగు భవనాలు నిర్మించి మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రపన్నుతుందని ఆరోపిస్తున్నారు.

కొత్త రాజధాని ఏర్పాటు అనేది ప్రజాస్వామిక ప్రక్రియలో అందరి భాగస్వామ్యంతో, అందరి ఆమోదంతో చాలా సంతోషకరంగా జరగాల్సినటువంటి దానిని సంఘర్షనాత్మకంగా, సందేహాలతో, రైతుల ఆగ్రహజ్వాలలు, విపక్షాల ఆందోళనలతో రాజధాని నిర్మాణం ఎలా సాగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.