ఆగని రైతు ఆత్మహత్యలు

  • 14 రోజుల్లో 14 ఆత్మహత్యలు
  • భర్త వెంటే భార్య
  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో, నృత్యాలతో, ఎంతో సందడిగా ప్రజలకు కనువిందుకలిగేలా పూల పండుగ జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన మొట్టమొదటి సాంస్కృతిక పండుగ జరుపుకోవడం ఆనందించవలసిన విషయమే, కానీ మహబూబ్ నగర్ లో జరుగుతున్న సంఘటలను గురించి విస్మరించారు.

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గపరిధిలోని కొన్ని గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలతో వారి కుటుంబాల్లో చికట్లను నింపుతున్నాయి. జిల్లాలోని రైతుల ఆత్మహ్యలు పునరావృతం అవుతుందనటానికి ఇదొక నిదర్శనం. గత 14 రోజులలోనూ 14 మంది రైతుల ప్రాణాలు గాలిలోకలిసిపోయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు రాజకీయ పార్టీల నాయకులు కానీ పట్టించుకున్న పాపానపోలేదు.

తాజాగా జిల్లాలోని మన్ననూర్ గ్రామానికి చెందిన రమావత్ ఫకీరా 53, అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని దురదృష్టం వెంటాడింది. గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఏ యేడుకాయేడు పంట దిగుబడి తగ్గడమే తప్పా పెరగలేదు. అదే విధంగా ఒక గిరిజన రైతు రెండు ఎకరాలలో పత్తి పంట వేశాడు. పంట పెట్టుబడి కోసం బయట వ్యక్తుల దగ్గర అప్పుచేయాల్సిన పరిస్థితి వచ్చింది. పంట తెగులు సోకిందని తెలుసుకొని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అతను పంట పొలంలోనే ఆత్మహత్యకు ఒడిగట్టాడు.

ఆఖరి ప్రయత్నంగా అతను పురుగుమందును పిచికారీ చేసి అదే మందును తాగాడు. చావుబ్రతులకమధ్య ఉన్న అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అతనిని కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో శనివారం రాత్రి అతను మృతిచెందాడు. అతని నలుగురు పిల్లలూ అనాథలయ్యారు. పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబం వీధినపడాల్సిన పరిస్థితి వచ్చిందని అతని భార్య డ్వాలీ తెలిపింది.

మహబూబ్ నగర్ జిల్లాలో జరగుతున్న రైతుల కన్నీటి గాధలపై శ్రద్ధ పెట్టాలి. సభ్య సమాజం మేల్కొని స్పందించాల్సిన పరిస్థితి ఉంది. మృతి చెందిన 14 మంది రైతులు పత్తి పంటను పండించుకుంటున్నవారే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలి.

రైతుల ఆత్మహత్యలు తీవ్రరూపం దాల్చాయి. ఉప్పనూతల్ మండలంలోని కొట్టెం బుచ్చయ్య అనే మరో పత్తి రైతు చేసిన అప్పులు తీర్చలేక పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. బుచ్చయ్య మృతి చెందిన కొద్దిసేపటికే అతని భార్య వెంకటమ్మ బాధ తట్టుకోలేక గుండెపోటుతో మరణించింది.

అధికంగా పెరుగుతున్న పంట నష్టాలవల్ల ఈ ముప్పు వాటిల్లుతోంది. రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్న వారి ఆశ నిరాశే అయింది. రుణదాతల ఒత్తిడి పెరగడంతో రైతు ఆర్ధిక వ్యవస్థ ఊపిరి ఆడకుండా అతలాకుతలం చేస్తున్నది. వంగూరు, తురకపల్లి, పెనుమెల్ల, మంగలపల్లి, పెద్దొడి వంటి గ్రామాల్లో పత్తి రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఉన్నారు.

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు రైతుల ఆత్మహత్యల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రైతుకు తగిన సహాయం అందిచాలని కాంగ్రెస్, బిజేపి, టిడిపి జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు రూ 10 లక్షల నష్టపరిహారం అందిచాలని వారు డిమాండ్ చేశారు.

గత ఆగస్టు 15 వరకు మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కరువు కాటకాలతో నిండిపోయి ఉంది. మిగిలిన తెలంగాణాలో దాదాపు 140 మంది రైతులు నాలుగు నెలలకాలంలో ఆత్మహత్యలు జరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో 40.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగుచేయాల్సి ఉండగా, ఆగస్టు చివరి నాటికి కేవలం 20 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగుచేయబడింది.

ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి వాగ్దానం చేసింది. రిజర్వు బ్యాంక్ దానికి అంగీకరించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు విడుదల చేయాలని నిర్ణయించింది. రుణ మాఫీ అమలుపై జాప్యం జరగటంతో తెలంగాణ గ్రామాల్లో ఇటువంటి విషాదకరమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

ఇది ఇలాఉండాగా మరో ముఖ్యమైన సమస్య రైతులను వెంటాడుతున్నది. విద్యుత్ సమస్య రైతులను తీవ్ర సంక్షోబానికి గురిచేస్తుంది. విద్యుత్ కోత వల్ల వరంగల్ కు చెందిన బండ్ల మల్లయ్య రైతు తన వరి పంటను కాపాడుకోలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి సంఘలు ఖమ్మం జిల్లాలో కూడా సంభవించాయి.

రైతు ఆత్మహత్యలు జరిగిన మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలను పిసిసి అధికార ప్రతినిధి మల్లు రవి సందర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నది, దానిని నివారించడానికి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీని నాయకులు డికే అరుణ, జీవన్ రెడ్డిలు ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని నిందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.