ఆచి తూచి అడుగేస్తాం : కేసీఆర్

హైదరాబాద్ : అనేక త్యాగాలు, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పునర్మిణా బాధ్యత చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి అడుగు ఆచితూచి వేస్తుందని, తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ మంచి నీళ్లు అందిస్తుందని, ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీసే కార్యక్రమం ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అమలుచేసి చూపిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.  అధికారంలోకి వచ్చిన తొలి కేబినేట్ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ సహకరించకపోయినా రైతు రుణ మాఫీ అమలు చేస్తున్నాం. దళితులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని హమీ ఇచ్చి అమలు చేశాం. భూమిని ఉపయోగించుకోలేని ప్రవాస భారతీయులు ఎవరైనా ఉంటే అవి ప్రభుత్వాని ఇవ్వాలని కోరారు. అలాంటి భూములను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దళితులకు ఇచ్చినట్లే పేద గిరిజనులకు కూడా భూమి ఇవ్వనున్నాం అన్నారు. ప్రజలకు హామీ ఇవ్వకపోయినా కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ వంటి పథకాలు పెట్టామన్నారు. అల్లరి చేష్టలతో అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణ వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, పథకాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి పెట్టాలన్నారు. సభ్యత్వ నమోదు, గ్రామకమిటీల నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. ఇవి జిల్లాకు సుమారు 400, ప్రతి నియోజవర్గానికి 40 పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే పార్టీ ప్లీనరీలో అన్ని అంశాలపై స్పష్టత ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, రమణాచారి, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ముఖ్యనేతలంతా హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.