ఆదాయ మార్గాలకు అన్వేషణ

హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం పెరిగింది. ప్రస్తుతం ఏడాది కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయాన్ని గడించే దిశగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. జీరో వ్యాపారం చేసే వ్యాపారులపై ఉక్కు పాదం మోపాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇన్ ఫార్మర్ల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా జీరో వ్యాపారాన్ని అరికట్టాలని సర్కార్ నిర్ణయించింది. స్వల్ప చట్ట సవరణల ద్వారా వాణిజ్యపన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

ఆదాయ మార్గాల అన్వేషణ కు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేతదారుల నుండి చట్టప్రకారంగా పన్నులను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది పన్ను వసూళ్ళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ 27,777 కోట్ల ఆదాయం వస్తోందని లక్ష్యంగా పెట్టుకోగా, రూ 23,727 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 36 వేల కోట్లను లక్ష్యంగా పెట్టుకొన్నారు. గత ఆర్ధిక సంవత్సరం (2013-14) కంటే ఈ ఆర్ధిక సంవత్సరంలో (2014-15) రూ 6,184.27 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడాది కంటే ఈ ఏడాది 35 శాతం ఆదాయం పెరిగింది. పెట్రోల్, డీజీల్ ధరల్లో వ్యత్యాసాలతో పాటు మద్యం అమ్మకాలు అనుకొన్న స్థాయిలో లేకపోవడం వల్ల కొంతమేర ఆదాయం తగ్గిందని ప్రభుత్వం భావిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ దాడులతో కొంతమేర ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు జీరో వ్యాపారం చేసే వ్యాపారులపై ప్రభుత్వం దాడులు చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ 20 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొంది.

ఇప్పటివరకు పన్నుల చెల్లింపు పరిధిలో లేని వాటిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఎటువంటి సంస్థలను పన్నుల పరిధిలోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పోరేట్ ఆసుపత్రులు, హోటళ్లు, సినిమా హాళ్ళలో పన్నుల వసూళ్ళ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా చెక్ పోస్టులను బలోపేతం చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో పాటుగా కొన్ని శాఖల నుండి ఆదాయాన్ని పెంచుకొనేందుకుగాను చట్టసవరణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.