ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరి

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గుట్ట చుట్టూ ఉన్న రెండు వేల ఎకరాల భూమిలో ఆధ్యాత్మిక, పర్యాటక సంబంధిత కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు. అందులో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, విల్లాలు, కాటేజ్‌లు, మిగిలిన 400 ఎకరాల భూమిని నృసింహ అభయారణ్యం, జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు శుక్రవారం వచ్చిన కేసీఆర్ హెలికాప్టర్ లో తిరుగుతూ గుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుట్ట పైన ఉన్న 103 ఎకరాల బంచరాయిగా భూమిని దేవస్థానం ఆస్తిగా మార్చాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.  అదే విధంగా గుట్ట కింద గాంధీనగర్‌లో 73 కుటుంబాలు చాలా ఏళ్ల నుంచి గుట్ట వద్ద నివాసం ఉంటున్నారు. వారికి ఆ భూమిని క్రమబద్ధీకరించి, ఇండ్ల నిర్మాణాన్ని అనుమతిస్తూ పట్టాలు జారీ చేస్తామని హామీనిచ్చారు. దేవస్థానం సన్నిధిలో గత 23 ఏళ్లుగా పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ సిబ్బంది 43 మందిని క్రమబద్ధీకరిస్తామని అన్నారు.

సుమారు రూ.60 కోట్లకు పైగా ఆదాయంతో, రూ.30 కోట్ల మిగులు ఉన్న దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భగుడి గోపురం ఎత్తు పెంచడంతోపాటు స్వర్ణ గోపురం నిర్మిస్తామని ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని అమలు చేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, ఆలయ ఈవో కృష్ణవేణి, ధర్మకర్త నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.