ఆప్ విజయకేతనం

kejriwal-10 sakalam

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకుంటున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ: రెండేళ్ల కిందట పుట్టిన పార్టీ ధాటికి తట్టుకోలేక రెండు జాతీయ పార్టీలూ గింగిరాలు తిరిగాయి. మంగళవారం వెలువడిన దిల్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలలో 67 స్థానాలు గెలుచుకోవడం దిల్లీలోనే కాదు భారత దేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది. సామాన్యుడి పార్టీగా ముద్రపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఊహకందని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. సామాన్యుడిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన కేజ్రీవాల్‌కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మేధావులు, అసాధారణ బలగమున్న బీజేపీ, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయాయి.

బీజేపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 125 ఏండ్ల చరిత్ర కలిగి, 15 సంవత్సరాల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరువలేకపోయింది. రెండు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు, కిరణ్‌బేడీ, అజయ్‌మాకెన్ లు ఆప్ ప్రభంజనం ముందు నిలువలేక ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దిల్లీ ప్రజల తీర్పు దేశరాజకీయాల్లో గొప్ప మలుపుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి నుపుర్‌శర్మపై 31,583 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కేజ్రీవాల్‌కు 57,213 ఓట్లు వచ్చాయి. కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌బేడీ ఓటమి పాలయ్యారు. ఆమె తన సమీప ఆప్ అభ్యర్థి ఎస్‌కే బగ్గా చేతిలో 2,277 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్ మాకెన్ కనీసం రెండోస్థానం కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన పోటీ చేసిన సదర్ బజార్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి సోమ్ దత్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ జైన్ పై 34,315 ఓట్ల తేడాతో గెలుపొందారు. సోమ్ దత్‌కు 67,507 ఓట్లు రాగా, ప్రవీణ్ కుమార్‌కు 33,192, అజయ్ మాకెన్ కు కేవలం 16,331 ఓట్లు వచ్చాయి.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక గెలుపు కట్టబెట్టినందుకు ఓటర్లకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.