ఆలయాల అభివృద్ధి పై సమీక్ష

ఆలయాల అభివృద్ధి పై సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ లో ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆలయాల మరమ్మత్తుల కోసం పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ధూప, దీప, నైవేద్యానికి రూ 5.41 కోట్ల నిధుల విడుద‌ల‌కు సీజీఎఫ్ క‌మిటీ అంగీకరించింది. ముఖ్యమంత్రి మొక్కులను తీర్చేందుకు రూ 5.59 కోట్ల విడుద‌ల‌కు క‌మిటీ ఆమోదించింది.

కామన్ గుడ్ ఫండ్ పై ఎండోమెంట్ ఉన్నత అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ వ‌ద్ద మొత్తం రూ 31.43 కోట్ల నిధులు ప్ర‌స్తుతం సీజీఎఫ్ ఖాతాలో ఉన్నాయ‌ని, 2015- 16 సంవ‌త్స‌రానికి గాను రూ 10 కోట్లు వ‌సూలు చేయాల‌ని లక్ష్యంగా చేసుకున్న‌ట్లు అధికారులు మంత్రికి వివరించారు. గ‌తేడాదితో పాటు ఈ ఏడాదికి క‌లిపి రూ 30 కోట్ల బ‌కాయిల‌ను వ‌సూలు చేయాల్సి ఉంద‌ని వారు తెలిపారు. మ‌రోవైపు రాష్ట్రంలోని 300 ఆలయాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు గాను మొత్తం రూ 61.33 కోట్లు మంజూరు అయ్యాయని, ఇప్ప‌టికే రూ 10.81 కోట్ల నిధులు విడుద‌ల చేయగా మ‌రో రూ 50.52 కోట్ల నిధుల విడుద‌ల చేయాల్సి ఉంద‌ని అధికారులు మంత్రికి తెలిపారు.

ఆల‌యాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు గానూ 2015-16 ఆర్ధక సంవ‌త్స‌రానికి రూ 10 కోట్లను మంజూరు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ధూప, దీప, నైవేద్యం కింద రూ 5.41 కోట్లు, వేద పాఠ‌శాల‌కు రూ 10 ల‌క్ష‌లు సీజీఎఫ్ నిధుల మంజూరుకు క‌మిటీ అంగీక‌రించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులను తీర్చేందుకు గాను దేవాదాయశాఖ తరపున బంగారు ఆభరణాలను స‌మ‌ర్పించేందుకు రూ 5.59 కోట్లను ఇచ్చేందుకు సీజీఎఫ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. అదే విధంగా మెద‌క్ జిల్లాలోని దుబ్బాక బాలాజీ ఆల‌య మ‌ర‌మ్మ‌త్తుల‌కు ఈ ఏడాది రూ 1.25 కోట్లు, వ‌చ్చే సంవ‌త్స‌రానికి మ‌రో రూ 1.25 కోట్లను సీజీఎఫ్ నిధులు మంజూరు చేస్తూ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. అదే విధంగా దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.