ఇంటింటికీ మంచి నీరు నా కల : కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీటిని అందించడం తన స్వప్నమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 27 వేల కోట్ల వ్యయంతో ఈ వాటర్ గ్రిడ్ చేపడుతున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో డీపీఆర్ సర్వేను పూర్తి చేయాలని, దీని కొరకు రూ.317 కోట్ల నిధులను తక్షణం మంజూరు చేస్తామని చెప్పారు.

మొత్తం 24 గ్రిడ్‌లతో అన్ని గ్రామాలు అనుసంధానం చేస్తూ పైప్‌లైన్లు వేయాలని నిర్ణయించారు. డీపీఆర్ సర్వే కోసం రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రో వాటర్ వర్క్స్, పబ్లిక్ హెల్త్ లాంటి శాఖలు ప్రజలకు మంచినీరు సరఫరా చేయడం కోసం పనిచేస్తున్నాయని, వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి రావలసిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మంచినీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్ స్వీకరించాలని చెప్పారు. రాబోయే 30 ఏళ్లకు సంబంధించిన అవసరాలు కూడా తీర్చే విధంగావాటర్ గ్రిడ్ రూపకల్పన జరగాలన్నారు. ఏ జిల్లాకు ఏ నీటి వనరుల ద్వారా నీరందించాలనే విషయంలో ఖచ్చితమైన అవగాహనకు రావాలని సీఎం చెప్పారు.

గ్రామాలకు నీరు అందించేందుకు పూర్తిగా లిప్టుల మీద ఆధారపడవద్దని, సమీపంలోని కాంటూర్లను గుర్తించి, అక్కడికి నీరు పంపించి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం జిల్లాలు, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించాలన్నారు.

జూరాల, నాగార్జున సాగర్ వంటి శాశ్వత నీటి వనరులుగా ఉన్నాయని, గోదావరి ఎత్తిపోతల పథకం లాంటివి కొన్ని రోజులు మాత్రమే నీరు అందించగలుతున్నాయి. అలాంటి చోట్ల స్టోరేజ్ ట్యాంకులను నిర్మించాలని సూచించారు. జలాశయాల్లో కూడా 365 రోజుల పాటు మంచినీటి అవసరాలు తీర్చడం కోసం డెడ్ స్టోరేజ్ లెవల్స్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు నాగిరెడ్డి, ఎస్‌కే జోషి, రేమాండ్ పీటర్, ప్రదీప్‌చంద్ర, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావులతో పాటు ఆర్‌డబ్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.