ఉద్యోగాల భర్తీ పై శాసనసభలో వాడి వేడి చర్చ

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై తెలంగాణ శాసనసభను కుదిపేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎం.ఐ.ఎం మినహా అన్ని రాజకీయపార్టీలు శాసనసభ నుండి వాకౌట్ చేశాయి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై మంగళవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో వాడీ వేడీగా చర్చ జరిగిదంది. అన్ని రాజకీయ పార్టీలు కూడ ఈ అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన తెలంగాణ యువతకు నిరాశే ఎదురైందని విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వశాఖల్లో ఖాళీలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నతోనే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయింది.

ఉద్యోగాల భర్తీ కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమాధనం ఇచ్చారు. కమల్ నాథ్ కమిటీ ఉద్యోగుల విభజన చేయలేకపోవడం మూలాన పూర్తిస్థాయి ఐఎఎస్ అధికారులు కేటాయింపు జనవరి వరకు పూర్తి కాలేకపోయిందన్నారు. గత ఏడాది ఆగస్టు 8న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. టీఎస్పీఎస్ ను బలోపేతం చేసేందుకు ఈ ఏడాదిలో 127 పోస్టుల భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు.  వివిధ శాఖల్లోని  ఖాళీలపై సమాచారం సేకరిస్తున్నట్టు మంత్రి సభకు తెలిపారు. జిల్లా జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులను త్వరలోనే భర్తీచేయనున్నట్లు ఆయన తెలిపారు. హరగోపాల్ కమిటీ కొన్ని ప్రతిపాదనలను చేసిందని, ఇంకా వాటిపై ఆమోదం తెలపలేదని మంత్రి ఈటెల తెలిపారు.  వివిధ కేటగిరిల్లో  లక్షా 7 వేల 774 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఉద్యోగాల భర్తీపై  ప్రభుత్వ సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని బీజేపీ పక్ష నాయకుడు లక్ష్మణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ లక్ష్యంతో రాష్ట్రం ఏర్పాటైందో, ఆ లక్ష్యం నెరవేరలేదని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన మూడు మాసాల్లోనే ఉస్మానియా యూనివర్శిటీలో నిరుద్యోగ యువత ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేయాల్సిందిగా సూచించారు. రాజకీయ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయే తప్ప, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదని లక్ష్మణ్ తెలిపారు.

అదే విధంగా వామపక్షాలు కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబట్టాయి. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ పక్షనేత రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలకు  కమల్ నాథ్ కమిటీ కమిటీతో ముడిపెట్టవద్దని సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య కోరారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అడ్డంకులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాజయ్య కోరారు.

విపక్షాలపై ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. విపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఘాటుగానే సమాధానం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ విపక్షాలపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల వివరాలను సేకరించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వారందరికీ ఉపాధి కల్పిస్తామని మంత్రి ఈటేల చెప్పారు.

ఇదే అంశంపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. లక్ష ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి సభలో చేసిన ప్రకటనను వంశీచంద్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి హారీష్ రావు జోక్యం చేసుకొని రాజకీయ ఉపన్యాసాలను సభ బయట చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హారీష్ రావు తెలిపారు. అయితే ఇదే విషయమై సీఎల్ పీ నాయకుడు జానారెడ్డి జోక్యం చేసుకొని లక్ష ఉద్యోగాలను ఎప్పటిలోపుగా భర్తీ చేస్తారు, ఉద్యోగాల భర్తీని ఎలా పూర్తి చేస్తారో తెలపాలని కోరారు. అయితే ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది. అదే విధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు కూడా సభ నుండి వాకౌట్ చేశాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.