ఉనికిని కోల్పోవద్దు : కోదండరాం

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఘాలు, వేదికల అవసరం లేదనే అభిప్రాయం సరికాదని, పాత్ర మారుతుందే తప్ప వాటి ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలోని శ్రీనివాస గార్డన్స్ లో ఆదివారం జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక (తెవివే) దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులవల్ల తెలంగాణ ప్రాంత నష్టపోయిన తీరును ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశ్యంతోనే తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటుచేశామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ప్రజా సంఘాలు ఏర్పడ్డాయని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావంతులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమిష్టిగా చర్చించుకొని వాటి సాధనకు బాటు వేస్తామని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఉద్యమం ఆగలేదని, పునర్నిర్మాణం వరకు కొనసాగుతుందన్నారు. సామాజిక తెలంగాణ, పరిపాలన వ్యవస్థ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతోపాటు సమాజమూ కృషిచేయాలని రామచంద్రమూర్తి సూచించారు. ఇందుకు గాను ప్రజలకు ప్రభుత్వానికి తెలంగాణ విద్యావంతుల వేదిక నిఘా సంస్థగా, మార్గనిర్దేశంగా ఉంటూ నిరంతర అధ్యయనంతో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చిట్టచివరి వర్గాలల వారి నుంచి అభివృద్ధిని ప్రాంభించాలని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, చైతన్యం నింపడమే తెలంగాణ విద్యావంతుల వేదిక లక్ష్యమన్నారు. ఈ వేదిక తెలంగాణ సమాజంకోసం అంకితమైందని, ఆదివాసీలకు అండగా నిలిచిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, తెవివే నేత శ్రీధర్ దేశ్ పాండే, జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.