ఎమ్సెట్ పై ఎడతెగని సస్పెన్స్

  • తెలుగు రాష్ట్రాల మొండి పట్టుదల
  • మాకంటే మాకే అధికారం ఉందంటూ వాదనలు
  • డోలాయమాన స్థితిలో గవర్నర్ నరసింహన్
  • ప్రతిభావంతులైన విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రమాదం
  • విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ చుక్కలు చూపిస్తున్న విద్యామంత్రులు

 

హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆది నుంచి అనేక వివాదాలకు కారణం. భారతదేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాలన్నీ దాదాపు ఏకాభిప్రాయంతో జరిగినవే. కానీ ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం ఓ ప్రాంత ప్రజలు ససేమిరా అన్నప్పటికీ, దశాబ్దాల పోరాటాన్ని యూపీఏ ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. సమస్యలు చుట్టుముడుతాయని తెలిసినా హడావుడిగా విభజనకు ఆమోద ముద్ర వేసిన యూపీఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో అనేక సమస్యలకు ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారాలు లేవు. నీరు, విద్యుత్, విద్య లాంటి అనేక ప్రధాన సమస్యలు ఇందుకు పెద్ద ఉదాహరణలు. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అర్ధం కాక రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు నిత్యం రాజ్ భవన్ గడప తొక్కుతునే ఉన్నారు.

ఇందులో తాజాగా ఇంజనీరింగ్ ఎంట్రెస్స్ పరీక్షల నిర్వహణ వివాదం. ఎంసెట్ నిర్వహించే బాధ్యత తమకే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించుకుంది. అంతేకాక అన్ని పరీక్షల తేదీలు కూడా ప్రకటించేసింది. పునర్విభజన చట్టంలో విద్య పదేళ్లపాటు ఉన్నందున సెట్ లను నిర్వహించే హక్కు తమకు ఉందనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ వాదనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇలా ఎవరి వాదనలు వారివే.

వాస్తవానికి రెండు రాష్ట్రాల మద్య విద్యా వివాదం రాష్ట్ర విభజన ముందునుంచి రాజుకుంటునే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందంటూ ఆ ప్రాంత నేతలు, విద్యావేత్తలు వాదిస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వతహాగా తమకున్న అధికారాలను ఎందుకు వదులుకుంటుంది. అందుకే తమ విద్యను ఆంధ్రప్రదేశ్ చేతుల్లో పెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ తేల్చి చెబుతోంది. చివరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దగ్గరకు ఈ వివాద పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాదన మరోలా ఉంది. విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు విద్యను ఉమ్మడిగా ఉంచినందున తమకు ఆ హక్కు ఉందని చెబుతోంది. అలా కాని పక్షంలో ఏడాదికో రాష్ట్రం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశించాలని గవర్నర్ ను కోరుతోంది. రెండు రాష్ట్రాల వాద ప్రతివాదాల మధ్య గవర్నర్ డోలాయమానంలో పడ్డారు.

రెండు రాష్ట్రాలు చెరో దారిలో నడుస్తుండటంతో మధ్యలో విద్యార్ధులు నలిగిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం పరీక్షా ఫలితాలపై పడుతుందని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ వీరి గోడు ఆయా రాష్ట్ర పెద్దలకు వినిపించడం లేదు, కనిపించడం లేదు. వేటికవే పంతానికిపోయి ఇటు విద్యార్ధులను, అటు తల్లిదండ్రులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణాపైనా ఇదే వివాదం ముసిరింది. ఎవరికి వారే పంతాలకు, పట్టింపులకు పోయారు. చివరకు గవర్నర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎంసెట్ గొడవ.

ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు సడలించడం లేదు. ఇంటర్ పై పెద్దగా అభ్యంతరం చెప్పని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంసెట్ పై సర్దుకుపోవడానికి ససేమిరా అంటోంది. ఇందుకు ప్రధానమైన కారణాలున్నాయి. ఎంసెట్ ను ఉమ్మడిగా నిర్వహించడం వల్ల ఆంధ్రప్రాంత విద్యార్ధులుకూడా తెలంగాణలోని కాలేజీల్లో అడ్మీషన్లు పొందటానికి వీలుంటుంది. సాధారణంగా ఎంసెట్ టాప్ ర్యాంకర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కాలేజీల్లోనే చేరుతుంటారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన కాలేజీలు ఇక్కడ ఉండటం ఇందుకు కారణం. ఎంసెట్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహించకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు తెలంగాణలో అడ్మీషన్లు పొందే హక్కు కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహించాలని పట్టుపట్టడానికి ఇదే ప్రధాన కారణం.

తెలంగాణ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. దశబ్దాలుగా తాము అన్యాయానికి గురైనామని రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అన్యాయం సహించేందుకు సిద్ధంగా లేమని చెబుతోంది. తెలంగాణ విద్యార్ధుల ప్రయోజనాలకోసం తామే ఎంసెట్ నిర్వహిస్తామని తేల్చి చెబుతోంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కూడా తమ సేవలు అందిస్తామని చెబుతోంది. చట్టంలో విద్యను ఉమ్మడిగా పేర్కొన్నందున ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల కోసం 15 శాతం సీట్లను కేటాయించేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతుంది.

మొత్తానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో నలిగిపోతున్నది మాత్రం విద్యార్ధులే. అసలు పరీక్షలు ఎవరు నిర్వహిస్తారో, ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేదు. తాము ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష రాయాలో తేల్చుకోలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న ఎంసెట్ వివాదం వల్ల పొరుగు రాష్ట్రాలలోని కళాశాలలు లబ్ది పొందుతున్నాయి.  పరీక్షల నిర్వహణ విషయంలో తెలుగు ప్రభుత్వాలు వేసే కుప్పిగంతుల వల్ల మెరిట్ విద్యార్ధులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.