ఎయిడ్స్ నివారణే మార్గం

ఎయిడ్స్ మానవరోగ నిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తుంది. దీనికి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఇది నాలుగు విధాలుగా తప్ప ఇతరత్రా ఏ మార్గంలోనూ వ్యాపించడంగాని, సోకడం జరగదు. వాటి పట్ల సరైన పద్ధతిలో వ్యవహరిస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహించే ఎయిడ్స్‌ డేలు జరపాల్సిన అవసరం ఉండదు. విద్యాలయాల్లో విధ్యార్ధులచేత ప్రతిజ్ఞ చేయించే అవసరం లేదు.

అంతర్జాతీయ స్థాయి నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. కాని ఎయిడ్స్ పట్ల వ్యవహరించాల్సిన దృక్పథంతో కూడిన అవగాహన ఇంకా సమాజానికి చేరడంలేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1తేదీ వచ్చిందంటే ముఖ్యంగా విద్యార్ధి దశనుంచే ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం విద్యాలయాల్లో వారిచేత “నేను హెచ్.ఐ.వి పట్ల సమగ్ర చైతన్యంతో, సంపూర్ణ దృక్పథంతో ఉంటానని, ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తానని, ఎయిడ్స్ నివారణలో నా వంతు కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ ను ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను“ అనే ప్రమాణాలతోనే ఆ రోజు ముగిస్తారు. మరుసటి రోజు అందరూ మరచిపోతారు.

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2014 వారి లెక్కల ప్రకారం భారతదేశంలో 20.89 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడిపడిన వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సుమారు 4 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని అంచనా. భారతదేశంలో ఉన్న ఎయిడ్స్ బాధితుల్లో 31 శాతం మంది యువతీయువకులు ఎయిడ్స్ బారినపడినవారు ఉన్నారని ఎన్ఏసీఓ వారి అంచనా. దీని దృష్టిలో ఉంచుకొని ఎన్ఏసీఓ మూడు మార్గాలను సూచించారు. అందులో యువతీ యువకులు తెలియని వయస్సులో శృంగారానికి దూరంగా ఉండటం, వివాహితులు జీవిత భాగస్వామితోనే శృంగారంలో పాల్గొనడం, శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ని తప్పక వాడటం.

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉన్న ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అప్రమత్తతతో పాటు ముందుస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. గ్రామస్థాయి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరులందరికి ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం, వైద్య శాఖ చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. ఎయిడ్స్‌ వ్యాధికి మందు లేదు కాని నియంత్రించే మార్గాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజల్లో అవాగాహన కల్పించాలి. విచ్చలవిడి శృంగారం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమిస్తుందని వీటిని అరికట్టాల్సిన బాద్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియపర్చాలి. ఎయిడ్స్‌ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్య వంతులు చేసి తద్వారా ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.