ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై గొడవ

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ  అంశంపై విపక్షాలు సర్కార్ ను ఇరుకునపెట్టాయి. విపక్షాల దాడితో ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభను తప్పుదోవపట్టించే విధంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి సమాధానం ఇచ్చారని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రయత్నించారు. ఉప ముఖ్యమంత్రికి మంత్రికి కేటీఆర్ తోడయ్యారు.

ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలుపై అసెంబ్లీలో  మంగళవారం షార్ట్ నోటీస్ డిస్కషన్ చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గీతారెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. వివిధ పక్షాల సభ్యలు ఈ అంశంపై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో  కొన్ని సూచనలను ప్రతిపాదించారు. మంత్రివర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధికార పక్షంపై విమర్శల దాడికి దిగారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను భర్తరప్ చేసిన తీరును చూస్తే దళితుల పట్ల ప్రభుత్వ ప్రేమకు నిదర్శనంగా ఉందన్నారు. రాజయ్యను ఎందుకు భర్తరప్ చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

పాత చట్టం ప్రకారమే నిధులు ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త చట్టాన్ని వర్తింపజేసుకొనే క్రమంలో విపక్షాల సూచనలను, సలహాలను స్వీకరిస్తామని శ్రీహరి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానంపై బీజేపీ శాసనసభపక్ష నేత లక్ష్మన్ తీవ్రంగా స్పందించారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన సలహాలు, సూచనల సంగతేంటని ప్రశ్నించారు. కొత్త చట్టం ఎప్పుడు తెస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

విపక్షాలకు సమాధానం చెప్పే సమయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి ఉపయోగించిన భాషపై కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలివిలేకుండా చట్టం చేశారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడడం సరికాదన్నారు. దళితులకు కేటాయించిన నిధులను వినియోగించకపోతే, అవి మురిగిపోకుండా వచ్చే ఏడాదికి బదలాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ఐటి మంత్రి తారక రామారావు కలగజేసుకొని, కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి నిరసన తెలిపి మాట్లాడిన తర్వాత ఆ పార్టీ నుంచి ఉప నేత మల్లు బట్టి విక్రమార్క మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పాకిస్తాన్ క్రికెట్ టీం లాగా ఒకరు కెప్టెన్ ఉంటే మిగతా వారంతా మాజీ కెప్టెన్లు అంటూ వ్యంగ బాణాలు విసిరారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సబ్ ప్లాన్ శాఖ, దళిత అభివృద్ధి పై ఇంత చర్చ జరుగుతున్నా సంబంధిత శాఖను  నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

మొత్తానికి సభలో వాద ప్రతివాదాలు జరుగుతున్న సమయంలో సభాపతి మధుసూదనాచారి భోజన విరామం ప్రకటించారు. దీంతో సభ వాయిదా పడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.