ఎ ట్రైన్ టు పాకిస్థాన్ – కుష్వంత్ సింగ్

Khushwant-singh

(20.3.2014న తన 100వ ఏట మరణించిన ప్రఖ్యాత జర్నలిస్టు కుష్వంత్ సింగ్ రచించిన ఈ నవలపై 10ఏళ్ల క్రితం ప్రజాసాహితిలో సమీక్ష వెలువడింది. ఆనాడు విద్యార్ధిగా వున్న సమీక్షకుడు నేడు సీ.ఎ. విద్యార్ధులకు శిక్షణనిచ్చే సంస్థ ‘ఛాంప్స్’ నిర్వాహకుడు)

రైలుబండి… తన లయబద్ధమైన శబ్దంతో శ్రావ్యమైన సంగీతాన్ని మనకి అందిస్తుంది. కుదుపులతో ఊయలను తలపిస్తుంది. కూతతో చాలా గ్రామాలను నిద్రలేపుతుంది. మనదేశంలో చాలామందికి ముఖ్యవాహనమైన రైలుబండి, అప్పుడప్పుడూ ప్రమాదాలకు లోనై మృత్యు శకటంగా కూడా మారుతుంది. కానీ… రైలుకు ఏవిధమైన ప్రమాదం జరగకుండానే అందులోని మనుషులందరూ శవాలుగా మారితే?… గమ్యానికి చేరుస్తుందనుకున్న రైలుబండి నరకానికి చేరిస్తే – దానిని రైలుబండి అనాలా? లేక రాక్షసబండి అనాలా? కానీ… ఆ రైలుబండి చేసిన పాపమేమిలేదు. అందులో ప్రయాణికులు చేసిన పాపమూ ఏమీ లేదు. అయినా వారందరూ చనిపోయారు. కాదు… చంపబడ్డారు… కాదు కాదు… దారుణంగా, కిరాతకంగా వధించబడ్డారు. వేటాడబడ్డారు. మతోన్మాదం వెర్రితలలు వేసినవేళ, మానవ కంకాళాలతో బండులాడాలని ముష్కర మూకలు ఉర్రూతలూగినవేళ, ఆ ఘోరం జరిగిపోయింది. ఆ ఘోరకలికి ప్రత్యక్ష సాక్ష్యం అయిన ఒక గ్రామం ఎలా స్పందించింది? ఆ గ్రామస్థుల మనోస్థితి ఎలా ఉంది అన్నదే కుష్యంత్ సింగ్ రాసిన” ట్రెయిన్ టు పాకిస్థాన్” నవల మూలకథ.
భారత్ – పాకిస్థాన్ విభజన జరిగిన రోజులవి. ప్రదేశాల విభజనతోపాటు ప్రజల విభజన కూడా జరగాలని కుట్రపన్నిన మతోన్మాదులు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల అండదండలతో మతకల్లోలాల వ్యాప్తికి నడుం కట్టిన రోజులవి.
ఈ విషయాలు చూచాయగా తెలిసినా, తమ మీద వాటి ప్రభావం ఉండబోదని నమ్మిన అమాయకులు మనోమాజ్రా అనే సరిహద్దు గ్రామ ప్రజలు. సిక్కులు, ముస్లింలు కలిసి సహజీవనం చేసే ఆ గ్రామంలో మేట్ సింగ్ గురుద్వారా పూజారి. ఇమామ్ బక్ష్ మసీదు ముల్లా. ఆశ్రయం కోరివచ్చిన అతిథికి ఆశ్రయంతోపాటు అన్నం కూడా పెట్టే మంచి మనసున్న మనిషి మేట్ సింగ్. మత విద్వేషాన్ని కలలోసైతం ఊహించలేని స్వభావం ఉన్నవాడు. కష్టసమయాల్లో పరమాతస్థులకు ప్రాణాలొడ్డైనా సహాయం చేయాలని భావించేవాడు. మంచితనం, అమాయకత్వం, దైవభక్తి, కర్మసిద్దాంతం పట్ల అపారమైన నమ్మకం కలగలసిన వ్యక్తే మేట్ సింగ్. మతం వేరైనా, సరిగ్గా ఇవే లక్షణాలున్న ఇమామ్ బక్ష్ తాతయ్యగా పిలవబడుతూ ఊళ్ళో అందరి గౌరవాభిమానాలను పొందుతూ ఉంటాడు. సగటు భారతీయ మనస్తత్వం మతానికి అతీతమైనదని వీరిద్దరి మధ్య సౌమ్యం మనకు స్పష్టం చేస్తుంది.
గ్రామానికి కొత్తగా వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఇక్బాల్ (సింగ్) మేట్ సింగ్ ద్వారా గురుద్వారాలో ఆశ్రయం పొందుతాడు. విదేశాల్లో చదువుకున్న ఇక్బాల్ కీర్తి కాంక్షాపరుడు. ఏదో చెయ్యాలని తపన ఉన్నా, ఆ పనివల్ల తనకు కూడా పేరు రావాలని కోరుకునే వ్యక్తి. గ్రామస్థుల అమాయకత్వం పట్ల, వారు చూపించే అతి మర్యాదల పట్ల చికాకుపడుతూ వుంటాడు. గ్రామస్థులతో పాటు కలిసి భోజనం చెయ్యడానికి కూడా ఇష్టపడని అతను, వారిని ఉద్ధరించడానికే తాను వచ్చానని అనుకుంటూ ఉంటాడు. తనని తాను సంఘసేవకునిగా భావించే ఇక్బాల్, ఆ సంఘంతో తనూ మమేకం అవ్వాలని గ్రహించలేడు. మొదట్లో తనకు ఏ మతం లేదని చాటిచెప్పిన వ్యక్తే తన ప్రాణం మీదకు వచ్చేసరికి తను సిక్కు మతస్థుడనని చెప్పుకోడానికి ఏమాత్రం సందేహించడు. త్యాగం చేసేది చరిత్రలో అమరవీరుడిగా నిలవడానికే తప్ప అనామకంగా మరణించేందుకు కాదని ఇతగాడి అభిప్రాయం. ఒక పరిణతి చెందని, పలాయనవాద, కుహనా కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఇతడు మనకి కనిపిస్తాడు.
జుగుత్ సింగ్ అదే గ్రామంలో ఒక దొంగ. వేరే గ్రామాల వారినే తప్ప తన గ్రామం వారిని దోచుకోడు. అతు నేరస్థుల కుటుంబంలో పుట్టినవాడు. అత్యంత బలాఢ్యుడు. మొండిధైర్యం, తెంపరితనం, జులాయితనం… ఒకింత మంచితనం కలబోసిన వ్యక్తి. ఎవ్వరినీ లెక్కచేయడు. ఇమామ్ బక్ష్ కూతురైన నూరాన్ తో ప్రేమాయణం నడుపుతూ ఉంటాడు.
ఇకపోతే హుకుమ్ చాంద్ ఆ జిల్లా మెజిస్ట్రేటు మరియు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్. పాపాలుచేయడం, పాపభీతితో పశ్చాత్తాపపడటం ఇతని అలవాటు. తప్పు అని తెలిసినా వ్యక్తిగత సౌఖ్యాన్నిచ్చే ఆ తప్పు సరిదిద్దుకోడానికి ఇష్టపడని సగటు మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన కూతురి వయసున్న హసీనాబేగంతో సరస సల్లాపాలాడుతూ ఉంటాడు. తరువాత బాధపడుతూనే ఉంటాడు. కానీ తను మాత్రం మారడు.
మానోమాజ్రా గ్రామంలో జరిగిన దోపిడీ మరియు హత్యానేరంలో జుగ్గా(జుగుత్ సింగ్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్బాల్ ను విప్లవకారునిగా భావించి ఇదే అదనుగా అతనిని కూడా అదే కేసులో ఇరికిస్తాడు హుకుమ్ చాంద్. నిజంగా ఆ దోపిడీ, హత్యలను చేసిన వారిని గ్రామంలో వదిలిపెట్టి, ఆ నేరాలను ఎవరో ముస్లింలు చేసి పాకిస్థాన్ పారిపోయారని గ్రామస్థులను నమ్మిస్తాడు. ఇంత చేసినా మానోమాజ్రా గ్రామ ముస్లింలను క్షేమంగా పాకిస్థాన్ పంపించాలన్న ఆలోచన తప్ప అతనికి వేరే దురుద్దేశమేమీ ఉండదు.
ఇంతలో పాకిస్థాన్ నుంచి రెండు రైళ్ళు శవాలతో మానోమాజ్రా చేరుకుంటాయి. అవయవాలన్నీ ఖండఖండాలుగా నరికి, మాంసం కుప్పలు ఆ రైళ్ళలో పంపిస్తారు మతోన్మాద ముష్కరమూకలు. ప్రతీకారం పేరుతో పాకిస్థాన్ కి కూడా అలాగే ముస్లింల శవాలు పంపించాలని సిక్కు మతోన్మాదులు ప్రజలని రెచ్చగొడుతూ ఉంటారు. అంతటి ఉన్మాదకర పరిస్థితుల్లో కూడా మానోమాజ్రా ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారు. “ఏ మతం వాడైనా గానీ మన ఊరి ప్రజల జోలికొస్తే వారిని ప్రాణాలతో వదలబోమని” శపధం చేస్తారు. మానవీయ సంబంధాలు మతం కన్నా గొప్పవనే సామాన్య ప్రజల మనోభావాల్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సంఘజీవి అయిన మానవుడు తన సంఘ సమైక్యతను పరిరక్షించుకోవాలని పడే తపన గ్రహించవచ్చు. మతం కన్నా మానవత్వం, సమిష్టితత్త్వం చాలా ఉన్నతమైనవనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
తాము ఎంత సంయమనం పాటించినా, రోజు రోజుకూ పాకిస్థాన్ నుంచి వరదలా వస్తున్న సిక్కు శరణార్ధుల వల్ల తమ గ్రామ ముస్లిములకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గమనించి, వారిని వెళ్ళిపొమ్మని బాధగా వీడ్కోలు చెబుతారు మానోమాజ్రా సిక్కులు. బాధాతప్త హృదయాలతో, తమ సొంత ఊరిని, ఇళ్ళని, తమకు అత్యంత ఆప్తులైన సిక్కు సోదరుల్ని విడిచి పాకిస్థాన్ బయలుదేరతారు ఆ గ్రామ ముస్లింలు. వారందరూ వెళ్ళబోయే రైలులో ఊచకోత ప్రణాళికను అమలు జరుపుదామని కొందరు సిక్కు మతోన్మాదులు పథకం పన్నుతారు. ఈ పథకం గురించి తెలిసినా, ఆ ఘోరకలి ఆపడానికి హుకుమ్ చాంద్ ఏవిధమైన ప్రయత్నం చెయ్యడు. తాను అశక్తుణ్ణని తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు. అదేవిధంగా ఇక్బాల్ కూడా ఏమీ చేయడానికి సంసిద్ధుడవడు. వ్యర్ధమైన త్యాగం ఎందుకని ఆత్మవంచన చేసుకుంటాడు. కానీ… స్వతహాగా దొంగ, నేరస్థుడు అయిన జుగ్గా ఎంతో ధైర్యంగా ఆ ఘోరకలిని ఆపుతాడు. తన ప్రాణాన్ని సైతం అర్పించి కొన్ని వేలమంది ప్రాణాలను కాపాడుతాడు. అంతా సవ్యంగా జరిగేటప్పుడు గొప్పవారిగా చలామణి అయ్యే కొందరు, నిర్ణాయక సమయంలో పలాయనవాదులవుతారనడానికి హుకుమ్ చాంద్, ఇక్బాల్ లు ఉదాహరణలైతే ఆదర్శాలను ఆలోచనలతో కన్నా ఆచరణలో చూపడం అత్యంత అవసరమని జుగుత్ సింగ్ మనకు పాఠం నేర్పుతాడు. చివరకు జుగ్గాని నుజ్జు నుజ్జు చేసి, అతని మీదుగా, వేలమంది ప్రయాణికులతో ఆ రైలు సురక్షితంగా పాకిస్థాన్ వెళ్ళిపోతుంది.
అద్భుతమైన శైలితో తనకున్న అపారమైన అనుభవంతో, చదువరులను కట్టిపడేసే నడకతో, కుష్యంత్ సింగ్ విభజనానంతరం 50 సంవత్సరాల క్రితం రాసిన ఈ నవల ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కొద్దిపాటి మార్పులతో ఈ నవలను 5 సంవత్సరాల క్రితం సినిమాగా కూడా రూపొందించారు. ఈ నవలని తెలుగులోకి అనువదించిన ఆకుండి నారాయణమూర్తిగారు నిజంగా అభినందనీయులు. బృందావన్ పబ్లిషింగ్ హౌస్, తెనాలివారు దీని ప్రచురణకర్తలు. ఇంత మంచి నవల చరిత్రలో కలకాలం నిలిచిపోతుందనడంతో ఏమాత్రం సందేహంలేదు.
(ఉపఖండపు సాహిత్యంపై 2004 ఆగస్టు ‘ప్రజాసాహితి’ వెలువరించిన ప్రత్యేక సంచిక 265 నుండి)

– ఆర్. శశికుమార్

Have something to add? Share it in the comments

Your email address will not be published.