ఒకరిపై మరొకరు అభియోగాలు: తమ్మినేని

హైదరాబాద్, నవంబర్ 21: ప్రజా సమస్యలపై సరైన చర్చ జరపకుండా, ఒకరిపై మరొకరు అభియోగాలు చేసుకుంటున్నారని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపట్ల సరైన చర్చగాని, సరైనా నిర్ధారణలుగాని, ప్రకటనగాని శాసనసభలో ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించడంలో, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదని తమ్మినేని ఆరోపించారు.

రైతుల ఆత్మహత్యలను వేరే రకంగా చిత్రీకరించడం దారుణమని సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు.  రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాలోనే 89 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని న్యూడెమోక్రసీ కార్యదర్శి గోవర్ధన్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటివరకు ఏ అధికారులుగాని, మంత్రులుగాని, ఎమ్మెల్యేలుగాని పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.