ఒక్క రోజు పోలీస్ కమీషనర్ గా సాదిఖ్

హైదరాబాద్, అక్టోబర్ 15: హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా ఒక్క రోజు విధులు నిర్వహించే అరుదైన అవకాశం సాదిఖ్ (10) అనే బాలుడికి దక్కింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాదిఖ్ కు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కావాలన్నది కోరిక. బాలుడి కోరికను మేక్ ఏ విష్ స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలుసుకున్న నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి సాదిఖ్ కోరికను నెరవేర్చారు. బుధవారం ఉదయం సాదిఖ్ పోలీస్ దుస్తులతో కమీషనరేట్ కార్యాలయంలో అడుగు పెట్టాడు. అక్కడ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కమీషనర్ ఛాంబర్ లోకి వెళ్లి సీపి సీటులో ఆశీనులయ్యారు.  ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చావుబతుకుల మధ్య ఉన్న సాదిఖ్ కు ఈ అవకాశం ఇవ్వడం వల్ల అతని ఆరోగ్యం కుదుటపడాలని ఆయన తెలిపారు. సాదిఖ్ ఆశించిన విధంగానే పోలీసు కమీషన్ అవ్వాలని మనసారా కోరుతున్నట్లు కమీషనర్ తెలిపారు. అదే విధంగా సాదిఖ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి అందరిలాగే చదువుకొని ఒక మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నట్లు కమీషనర్ అన్నారు. సాదిఖ్ చివరి కోరిక తీర్చేందుకు పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకరించినందుకు సాదిక్ తండ్రి రహీమొద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.