ఒక పక్క ఉచితం.. మరో పక్క విక్రయం

  • సచివాలయంలో స్వైన్ ఫ్లూ మందుల విక్రయం
  • ప్రజల భయాన్ని సొమ్ము చేసుకున్న ఓ స్వచ్ఛంధ సంస్థ

 

హైదరాబాద్, జనవరి 24: స్వైన్ ప్లూ నివారణ కోసం హోమియో మందుల విక్రయం తెలంగాణ సచివాలయంలో కలకలం రేపింది. ప్రజల భయాన్ని ఆసరా చేసుకొని ఓ స్వచ్ఛంధ సంస్థ సచివాలయంలోనే హోమియో మందుల విక్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మందుల విక్రయదారులను అదుపులోకి తీసుకొన్నారు.

స్వైన్ ఫ్లూ విషయంలో రాష్ట్రంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సచివాలయంలోని డి బ్లాక్ లో ఓ స్వచ్ఛంధ సంస్థ (వీల్స్) ప్రతినిధులు స్వైన్ ఫ్లూ నివారణ హోమియో మందును బాటిల్ ఒక్కింటికి 40 రూపాయాల చొప్పున  విక్రయించింది.

రాష్ట్ర ప్రభుత్వం స్వైన్ ఫ్లూ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా మందులను అందుబాటులో ఉంచినట్టు ప్రచారం చేస్తోంది. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు యధేచ్చగా ఈ మందులను విక్రయించారు. మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకున్న సచివాలయ ఉన్నతాధికారులు అప్రమత్తమై స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులను విచారించారు. అప్పటికే 500 మందికి పైగా ఈ సంస్థ ప్రతినిధులు మందులను విక్రయించారు. విషయం తెలుసుకొన్న సచివాలయంలోని హోమియో డిస్పెన్సరీ వైద్యుడు ప్రభుత్వం ఉచితంగానే హోమియో మందులను సరఫరా చేస్తోందని తెలిపారు. డిస్పెన్సరీ వద్దకు వస్తే హోమియో మందులను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వ డాక్టర్ విష్ణుమూర్తి చెప్పారు.

ఆలస్యంగా స్పందించిన సచివాలయ అధికారులు స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులను విచారించారు. సచివాలయంలోని మహిళ ఉద్యోగసంఘాల నాయకులు హోమియో మందుల విక్రయానికి అనుమతిచ్చారని స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులను ఎస్ పి ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని హోమియో మందుల విక్రయానికి ఎవరు అనుమతిచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.