ఒప్పందం కుదిరింది

రాయపూర్, నవంబర్ 3: ఒక వైపు కరెంటు కోతలతో అన్నదాతల అకాల మరణాలు, మరోవైపు విపక్షాల ముప్పేట దాటితో టీఆర్ఎస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, విద్యుత్ సమస్యపై దృష్టి సారించింది. చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చత్తీస్ గఢ్ వెళ్లారు. రాయ్ పూర్ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరు రాష్ట్రాల విద్యుత్ ముఖ్య కార్యదర్శులు సంతకాలు చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. విద్యుత్ సరఫరాకు అంగీకరించిన చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చత్తీస్ గఢ్, తెలంగాణ మధ్య సంబంధం ఈనాటిది కాదని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య చాల ఏళ్ల నుంచే సంబంధాలున్నాయని పేర్కొన్నారు. అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు రమణ్ సింగ్ హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. అనంతరం చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు.

 

chattisgarh-kcr

చత్తీస్ గడ్ లో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

రెండు రోజుల పర్యటను నిమిత్తం ఆదివారం సాయంత్రం చత్తీస్ గఢ్ కు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కడి మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో అధికారుల సమావేశం అనంతరం కేసీఆర్ వీఎన్ ఆర్ విత్తనోత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. 1800 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అక్కడి అధికారులతో కలిసి ఆయన కాలినడకన తిరిగారు. భూములకు సంబంధించిన వివరాలను అక్కడి శాస్త్రవేత్తలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాలని అక్కడి రైతులను, శాస్త్రవేత్తలను కోరారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉన్న చత్తీస్ గఢ్ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు ఇతర అధికారులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.