ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాల నివారణకు కొత్త నిబంధనలు

Cyberabad-police-outer-ring-road

హైదరాబాదు నగరం చుట్టూ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు వాహనాల రాకపోకలకు అనువుగా ఉన్నా తరచూ ప్రమాదాలు జరగడం నగరవాసులను కలవరానికి గురి చేస్తోంది. దీంతో సైబరాబాదు పోలీసులు వాహన ప్రమాదాలు నివారించేందుకు కొత్త నిబంధనలు రూపొందించారు. వీటిని వాహనదారులందరూ పాటించాలని వారు కోరుతున్నారు. ఔటర్ రింగు రోడ్డులోని 1, 2 లేన్లపై ప్రయాణించే వాహనాలు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని వారు సూచించారు. అలాగే 3, 4 లేన్లపై రాకపోకలు సాగించే వాహనాలు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సైబరాబాదు పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని, అయితే ఇంతకు మించిన వేగంతో ప్రయాణించవద్దని వారు వాహన చోదకులను కోరుతున్నారు. అలాగే వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు చోదకులు 3, 4 లైన్ల పైకి రావాలని వారు చెప్పారు.

మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలపై నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసినట్లు సైబరాబాదు పోలీసులు తెలిపారు. వాహనాల స్పీడ్ ను అంచనా వేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు స్పీడ్ గన్లను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. వాహనాల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు నాలుగు పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేశామని వారు చెప్పారు. అలాగే ప్రమాదాలు జరిగిన సందర్భంలో సహాయక చర్యల కోసం నాలుగు అంబులెన్సు వాహనాలను, నాలుగు క్రేన్లను సిద్ధం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.