కనిపించని నాలుగో సింహమే పోలీస్ : చంద్రబాబు నాయుడు

విజయవాడ, అక్టోబర్ 21: “కనిపించని ఈ నాలుగో సింహమే పోలీసులు, కనిపెట్టుకుని ఉండే నరసింహావతారమే ఈ పోలీసులు“ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మంగళవారం విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులు పరిరక్షించడానికి, ఆడబిడ్డల మానాన్ని కాపాడటానికి  ఎన్నో త్యాగాలు చేసి, పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. పోలీసులు కూడా మనుషులేనని, ప్రజలకోసమే పోలీసులు త్యాగాలు చేస్తున్నారన్నారు. సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల కోసం ఏడాదిలో ఒక రోజు, కొన్ని క్షణాలపాటు జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి త్యాగాలను తలుచుకుంటేనే కళ్లు చమరుస్తున్నాయని నాయుడు అన్నారు. పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర, నాటి హోం మంత్రి మాధవరెడ్డి, జవహర్ లాల్ నాయక్, సుధాకర్, అనీల్ కుమార్ ఇలాంటి వాళ్లు వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎంతో మంది కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు.

అరాచకశక్తులను ఎదుర్కొవడం, వ్యవస్తీకృత నేరాలను అడ్డుకోవడం, అల్లర్లను అదుపుచేయడం, బందిపోట్లను నిలువరించడం, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడం లాంటి విధి నిర్వహణలో నిత్యం ప్రాణాలు అర్పిస్తున్నారని చంద్రబాబు అన్నారు. దేశం కోసం పోరాడే సిపాయి కంటే, రాష్ట్రంలో పోలీసులు వారి కంటే గొప్పవారని నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఒక్కసారి వచ్చే యుద్దం కోసమే సిపాయి పోరాడుతారు, కాని పోలీసు మాత్రం ప్రతి రోజు యుద్ధం చేస్తూనే ఉంటారని తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులతో అవసరమైతే ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, ఈ సమాజం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ముందుకు అడుగేస్తున్నారని నాయుడు తెలిపారు. పోలీసు వ్యవస్థపైన పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, పట్టణ కమీషనర్ వెంకటేశ్వరరావు, ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, శ్రీనివాసులు, కౌముది తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.