కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే

(తెలిదేవర భానుమూర్తి)

 

“నరవర నీచే నాచే వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్“………..అని జాబితా ఇస్తూ “అరయంగా కర్ణుడీల్గె ఆరుగురి చేతన్“ అని కవి అంటాడు. కర్ణుడి చావుకు ఆరు కారణాలుంటే మన రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయి. తెలంగాణలోని  జిల్లాల్లో పంటలన్నీ వర్షాల మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ జిల్లాల్లో వర్షపాతం తక్కువ. వర్షాలు అంతంత మాత్రంగా ఉండడంతో చెరువులు, గొట్టపుబావులపై వ్యవసాయం ఆధారపడి ఉంది. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడితో పాటు కరెంట్, పనిముట్లు, ఎరువులు, విత్తనాలు కావాలి. సన్నకారు రైతులు పెట్టుబడి కోసం బ్యాంకు రుణాల మీద ఆధారపడి ఉన్నారు. అన్నీ సమకూరినా కరెంటు కోతలుంటే రైతులకు కష్టాలే, మిగిలేవి కన్నీళ్లే.

 

అన్నీ అమరి పంట పండినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే పంట చేతికి రాదు. పంటచేతికి వచ్చిన తరువాత ధాన్యాన్ని మార్కెట్ యార్డికి తరలించాక వాతావరణం అనుకూలించపోయినా రైతుకు నష్టమే. తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనరు. గతంలో కంటితుడుపు చర్యగా ప్రభుత్వం రైతులకు పంటనష్టపరిహారం చెల్లించేది. పంటరుణాల ఇవ్వడం మొదలయ్యాక నష్టపరిహారానికి  కాలం చెల్లిపోయింది. పంటరుణం చెల్లించలేని రైతుకు రెండోసారి ఏ బ్యాంకు రుణమివ్వదు. అప్పుతీర్చలేని వాడికి అప్పు ఎవరిస్తాడు. దాంతో రైతులు వడ్డీవ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకొంటున్నారు. కొన్నిసందర్భాల్లో పరువునే కాకుండా తమ పంట పొలాలను కూడా  కోల్పోతున్నారు.

 

రుణబాధ మూలంగా తెలంగాణలో దినాం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే జరుగుతున్నాయా? గతంలో జరగలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మహారాష్ట్రలోని విదర్భలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 1995 నుంచి 2012 వ సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉసురు తీసుకొన్నారు. రైతులు తిన్నది అరక్క చచ్చారని ఒక రాజకీయ నాయకుడు వాక్రుచ్చారు. ఇప్పుడు కూడా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ కలహాలతో పాటు ఇతర కుటుంబ సంబంధమైనా కారణాల మూలంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సెలవిచ్చారు.

 

బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత చర్చ మొదలు కావల్సిన తొలి రోజునే అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు రైతుల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై చర్చకు పట్టుబట్టారు. రైతులను అవమానిస్తూ వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యలుచేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఆ సమయంలో పోచారం సభలో లేరు. సభాకార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంలో పదిమంది తెలుగుదేశం సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.  రెండు రోజుల అనంతరం అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి సభ్యులు ప్రభుత్వంపై మప్పేట దాడి చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికిపోయింది. ప్రతిపక్ష సభ్యులుచేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కె.సి.ఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తిప్పికొట్టారు. కె.సి.ఆర్కు ముందుచూపు లేని కారణంగా కరెంట్ కష్టాలు వచ్చాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. చంద్రబాబు మూలంగానే తెలంగాణకు కరెంట్ కష్టాలు వచ్చాయని అధికారపక్ష సభ్యులు ప్రత్యారోపణ చేశారు. ఛత్తీస్ గఢ్ తో ఒప్పదం కుదుర్చుకొన్న కారణంగా మూడేళ్ల తరువాత కరెంటుకోతలు అసలుండవని ముఖ్యమంత్రి అన్నారు. మూడేళ్ల వరకూ రైతుల ఆత్మహత్యలు జరగవలసిందేనా అని ఎంఐఎం సభ్యుడు అక్చరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. గత కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధికారపక్ష సభ్యులు అన్నారు. చంద్రబాబు పిపీఏలను రద్దుచేయడాన్ని కాంగ్రెస్ శాసనసభాక్ష నాయకుడైన జానారెడ్డి తప్పుబట్టారు.

 

రాజకీయనాయకులందరూ రైతుల ఆత్మహత్యలకు తామే మాత్రం భాద్యులం కామని వాదిస్తునారు.  మీరు కారణమంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు తప్ప రైతులకు భవిష్యత్తుపై ఆశకలిగించడం లేదు. వారికి ధైర్యాన్నినూరిపోయడంలేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకవివరాలు కూడా సరిగ్గాలేవు. ధనికులకే బ్యాంకులు కోట్లాది రూపాయలను అప్పుగా ఇస్తున్నాయి. ఆ అప్పులో కొన్ని కోట్లను మాఫీచేస్తున్నాయి. కోట్లాదిరూపాయల రుణాన్ని ఎగవేసిన బడా  పారిశ్రామికవేత్తల జోలికి ఎవరూ వెళ్లడంలేదు. కానీ లక్షరూపాయల రుణం చెల్లించలేని రైతును మనోవ్యథకు గురిచేస్తున్నారు. ఎవడు దొంగ అంటె బట్టపేల్కలోడు దొంగ అంటున్నారు. అసలు దొంగలను వదిలేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రైతులు పంట రుణాలను మాఫీ చేస్తామని నాయకులు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఏమేరకు నిలబెట్టుకొన్నారు. ధానే ధానేపే లిఖాహై ఖానేవాలేకా నామ్ అంటారు. రైతుపండించిన వాటినే మనమంతా తినిబతుకుతున్నాం. కానీ మనకు బతుకునిచ్చే రైతుకే బతుకు లేకుండా చేస్తున్నాం. రైతు ఆత్మహత్యలకు కేవలం రాజకీయనాయకులనే నిదించి ప్రయోజంనం లేదు. నకిలీవిత్తాలను, బ్లాక్ లో ఎరువులను అమ్మే వ్యాపారులతో పాటు కష్టాలో ఉన్న రైతులను ఆదుకోలేని మనమంతా కారణమే. తుఫాన్ భాదితులను ఆదుకోవడానికి లక్షలాది రూపాయల్లో విరాళాలు ఇచ్చేవారు రైతులను ఆదుకోవడానికి ఎందుకు విరాళాలు ఇవ్వండంలేదు. నిజనిర్థారణ కమిటీ వేసినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? ప్రతిపక్షాలు కూడా ఈ సమస్యను సాకుగా చేసుకొని తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పయత్నిస్తున్నాయని పిస్తున్నది. మనమంతా రైతుకు అండగా నిలబడాలి. రైతుల ఆత్మహత్యలు జరిగిన తర్వాత నష్ట పరిహారం ఇవ్వడం కంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. కాళోజీ నాగొడవలో చెప్పినట్లు. గాయకుని గానాలు, వైణికుని వాదాలు రాజకీయనాయకుల వేషాలే కాకుండా సమస్తం  కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.