కాంగ్రెస్ లో కలపడానికి నా పార్టీ ఏమన్నా గంగానదా?: పవన్

Pawan-Jana-sena

హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జన సేన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘అందరికీ హృదయ పూర్వక నమస్కారం’ అంటూ మొదలెట్టిన పవర్ స్టార్ తనకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం ఉందంటూ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, చిన్ననాటి నుంచి తనకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలంటే ఇష్టమని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓ కవితను స్మరించుకుంటానంటూ, ఇల్లేమో దూరం.. అంటూ తిలక్ కవితను చదివి అభిమానులను ఉత్తేజపరిచారు.

తన పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే అని స్పష్టం చేశారు. అంతేతప్ప అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. తన గుండెల్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయనకు తానెందుకు ఎదురెళతానని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ జన సేన పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కూడా వదిలిపెట్టలేదు. దిగ్విజయ్ ఇటీవల మాట్లాడుతూ పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలపమని వ్యాఖ్యానించారని చెబుతూ, కాంగ్రెస్ లో కలపడానికి తన పార్టీ ఏమన్నా గంగానదా? అని కౌంటర్ వేశారు.

తన పార్టీ వెనుక, తన వెనుక ఏ రాజకీయ వేత్తలు లేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉన్నదల్లా ఒకే ఒక వ్యక్తి అని, కరీంనగర్ జిల్లా, జమ్మికుంటకు చెందిన అతని పేరు రాజు రవితేజ అని వెల్లడించారు. రాజుతో తాను గత ఐదేళ్ళుగా చర్చిస్తున్నానని, ఎంతో మేధోమథనం సాగించానని తెలిపారు. పార్టీ విధివిధానాలకు ఓ రకంగా రాజే రూపకర్త అని చెప్పారు.

‘‘నేను రాజకీయాల్లోకి రావడం చాలా మంది మిత్రులకు ఇష్టం లేదు’’ అని సినీ హీరో పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసుకు తన రాజకీయ రంగప్రవేశం ఇష్టం లేదని ఆయన అన్నారు. త్రివిక్రమ్ తో విభేదించి మరీ రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.

తన పార్టీకి సైద్ధాంతిక బలముందని, ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ శత్రువులు ఏర్పడే అవకాశముందని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను చంపినా చంపొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, చావడానికైనా సిద్ధమే కానీ, పిరికితనంతో వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు.

‘‘నాపై విమర్శలు చేస్తే భయపడను’’ అని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. తాను పిరికిపందలాగా వెన్ను చూపే వాడిని కాదని ఆయన అన్నారు. తనపై రాజకీయపరంగా ఎవరెన్ని విమర్శలు చేసినా తలొంచేది లేదని ఆయన స్పష్టం చేశారు.

తాను సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అప్పట్లో తనకి లేదన్నారు. తాను కోరుకుంటే అప్పుడే పీఆర్పీ తరపున ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసుండేవాడినని పవన్ చెప్పారు. సమాజంలో జరిగే అన్యాయం, అక్రమాలు భరించలేక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టానని ఆయన తేల్చి చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.