కార్డున్నా… జేబు ఖాళీ…

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పంపిణీ చేసిన హెల్త్ కార్డులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకోని కారణంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులకు గురికావల్సి వస్తోంది.‎

ఉమ్మడి రాష్ట్రంలో కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపింది. కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల కోర్కెలకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులను జారీ చేసింది. అయితే కార్పోరేట్ ఆస్పత్రులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోవడం కారణంగా హెల్త్ కార్డులు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకోకపోవడం మూలానా ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసినా వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు చెల్లిస్తేనే చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తన్న ఓ ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డు పై వైద్యం చేసేందుకు  ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదు.

ఉద్యోగులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహారిస్తోందని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. ఈ మేరకు ఉద్యోగులకు నయా పైసా ఖర్చు లేకుండా హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు నిమ్స్ ఆసుపత్రిలో మినహా ఎక్కడా పనిచేయడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులున్నాయనే పేరుతో కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్తే జేబు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసినా తమకు ప్రయోజనం లేదని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.