కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు : చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 3: పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ ఎన్ టిఆర్ భవన్ లో సోమవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత చంద్రబాబు రూ 100 చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం మిగిలిన నాయకులు సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యుల నమోదు కార్యక్రమం ఒక పద్దతి ప్రకారం జరగాలని ఆనాడు స్వర్గీయ ఎన్ టి రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తలను సమర్ధులైన నాయకులుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

ఇతర పార్టీల వారు ఎన్నికల కమీషన్ చెప్పినా కూడా సభ్యత్వ నమోదు చేపట్టలేదని, ఎన్నికలు నిర్వహించ లేదని, దాంట్లో ఉండే సభ్యులకు సరైన గౌరవం ఉండే పరిస్థితి లేదన్నారు. కాని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. నేటి నుంచి నెల రోజులపాటు రెండు రాష్ట్రాల్లోను సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని కొంతమంది పగటి కలలు కంటున్నారని, అటువంటి వారు అడ్రసు లేకుండా పోయిన విషయం చరిత్ర నిరూపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.