కాల్చి చంపడం ఎంత తేలికో!

సంజయ

రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవేముందు అన్న చందంగా చేతిలో అధికారం ఉండాలేగానీ రాజ్య హింసకూ, పోలీసు తుపాకులకు అడ్డూ అదుపూ ఉండదు. ఒకే రోజున అటు తెలంగాణలో ఐదుగురు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మందిని పోలీసులు పిట్టల్లా కాల్చి చంపారు. చనిపోయిన పాతిక మందీ కూడా సమాజంలో వివక్షకు గురయ్యేవారే. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చనిపోయిన ఐదుగురు సిమి ఉగ్రవాదులు ముస్లిం మైనారిటీవారుకాగా, చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో చనిపోయిన ఇరవై మంది ఎర్రచందనం కూలీకార్మికులు ఆదివాసీలు. ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసులు, ప్రభుత్వాలు సమర్థించుకున్నాయి. సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరిని ఆత్మ రక్షణలో భాగంగానే కాల్చి చంపాల్సి వచ్చిందని పోలీసులు బాహాటంగానే చెప్తున్నారు. ఈ రెండు సంఘటనలను చూస్తే పాతికమంది ప్రాణాలు తీయడం ఇంత సులువా అనిపిస్తుంది.

ఈ రెండు సంఘటనలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మొదలు జాతీయ మానవ హక్కుల సంఘం, పౌరహక్కుల సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లా సంఘటన ఒక రకంగా తెలుగు-తమిళ ప్రజల మధ్య వైరంగా తయారైంది. ఈ నెల ఆరవ తేదీన సంఘటన జరిగింది మొదలు ఇప్పటివరకూ తమిళనాట నిరనసలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు సర్వీసులు పునరుద్ధరించబడలేదు.

చెన్నయ్ నగరంలో చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ వాణిజ్య సముదాయం ముందు తమిళ సంఘాలు ఆందోళనలు జరపడంతో మూసివేయక తప్పలేదు. చివరికి తమిళులెవ్వరూ హెరిటేజ్ ఉత్పత్తులను కొనవద్దనీ, వాడవద్దనీ తమిళ సంఘాలు పిలుపునిచ్చాయి. తెలుగువారికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్ర క్లబ్ కు పోలీసు భద్రత ఏర్పాటైంది. ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టడానికి వేలూరు నుంచి బయలుదేరిన ఎండిఎంకె నేత వైగో సహా వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ రెండు సంఘటనలూ ఒకే స్వభావంతో కూడి ఉన్నప్పటికీ తెలంగాణలో ఐదుగురు సిమి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపడంకన్నా ఎర్రచందనం కూలీలను ఇరవై మందిని చంపడంపై ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. సిమీ ఉగ్రవాదులు గతంలో హింసకు పాల్పడినట్లు అభియోగాలు దాదాపు రుజువు కావడం, అంతకుముందు సూర్యాపేట బస్టాండులో ఉగ్రవాదులు జరిపిన తుపాకి కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోవడం, నేర చరిత్ర ఉన్న వీరు గతంలో మధ్యప్రదేశ్ జైలు నుంచి తప్పించుకున్నట్లు రుజువు కావడం, ఉగ్రవాదుల చర్యలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున ఈ ఐదుగురిని ఎన్ కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చి చంపినా సామాన్య ప్రజానీకం నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని ఉగ్రవాదులు చేసిన నేరాన్ని సమర్థించాల్సిన అవసరమూ లేదు. కానీ వారు చేసిన నేరాలకుగాను చట్టపరంగా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ బాధ్యతను కూడా పోలీసులే పూర్తి చేయడం రాజ్యాంగ విరుద్ధం.

చేతులకు బేడీలు వేసి పోలీసు వ్యాన్ లో కూర్చుని ఉంటే పోలీసుల దగ్గర ఉన్న తుపాకులను ఎలా గుంజుకుంటారని, కాల్పులు ఎలా జరపగలుగుతారని వచ్చిన సందేహాలకు మాత్రం సమాధానాలు శూన్యం అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నవీరిని చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారన్నదానికీ సమాధానం లేదు. ఐదుగురు ఉగ్రవాదులు వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు హాజరవుతూ ఉంటే వారికి 17 మంది సాయుధ పోలీసులు ఎస్కార్టుగా ఉన్నారు. ప్రభుత్వ వాదన ప్రకారం చూస్తే, ఒక పోలీసు నుంచి ఉగ్రవాది ఒకరు తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణకై మిగిలిన పోలీసులు ఎదురు కాల్పులు జరపక తప్పలేదని, ఆ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులూ మరణించారు. కానీ ఉగ్రవాదులకు ఎస్కార్టుగా ఉన్న సదరు పోలీసు తన దగ్గర ఉన్న ఆయుధాన్ని బేడీలతో ఉన్న ఒక ఉగ్రవాది లాక్కునేంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడన్నదానికి సమాధానం లేదు.  ఉగ్రవాదులు చనిపోయిన దృశ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ కాల్పులు ఎంత ఏకపక్షంగా జరగాయో స్పష్టమవుతుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని సూర్యాపేట సంఘటనలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్చి చంపడాన్ని సమర్థించాల్సిన పని లేదు.

నిజానికి ఒక ఉగ్రవాద సంస్థ కార్యకర్తలుగా ఉన్న వీరికి భారత రాజ్యాంగంపట్లగానీ, ప్రజాస్వామ్యం పట్లగానీ విశ్వాసం, గౌరవం లేదు. ప్రజాస్వామిక విలువలను వారు పాటిస్తారన్న నమ్మకం కూడా మనలో ఎవ్వరికీ లేదు. అందువల్ల వారు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పోలీసుల్ని పొట్టనపెట్టుకున్నారు. వారికి మానవహక్కులనేవి అప్రాధాన్యమైనది. కానీ మన పోలీసులు మాత్రం ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ఉంది. చట్టాన్ని పాటించాల్సిన అవసరమూ ఉంది. సిమీ ఉగ్రవాదులు గతంలో పాల్పడిన నేరాలకుగానీ, సూర్యాపేట సంఘటనలోగానీ వారు చేసిన నేరాలకు చట్టపరంగా శిక్ష పడాలనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ వారిని పోలీసులే శిక్షించడం ఇక్కడ చర్చనీయాంశం. పైగా వారి నుంచి మూలాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరమూ ఉంది.

ఇక చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ సామాన్య ప్రజానీకం మధ్యలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజున ఇరవై మందిని చంపడం ఎంతో మందిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా తమిళుల్లో ఆగ్రహావేశాల్ని రగిల్చింది. ఈ ఎన్ కౌంటర్ ని నిశితంగా పరిశీలిస్తే చాలా సందేహాలకు సమాధానమే దొరకదు. నిజానికి ఎర్రచందనం చెట్లను నరకడం, దుంగలను గుట్టుచప్పుడు కాకుండా తరలించడం, అరుదైన సంపదను దొడ్డిదారిగుండా తరలించి సొమ్ము చేసుకోవడాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు.  స్మగ్లింగ్ వెనక బలమైన పలుకుబడి కలిగిన రాజకీయ శక్తులు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వారి స్మగ్లింగ్ కార్యకలాపాలకు కూలీలను పావుగా వాడుకోవడం దీర్ఘకాలంగా జరుగుతూ ఉన్నది.

స్మగ్లింగ్ లో పావులుగా ఉన్న కూలీలను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం, పోలీసులు భావించినట్లయితే ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం ఎంత మాత్రమూ కాదు. రెండున్నరేళ్ళ క్రితం ఒక కూలీని ఇదే విధంగా కాల్చి (పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి) చంపినా ఎర్రచందనం అక్రమ రవాణా ఆగలేదు. ఇరవై మందిని చంపితే ఇక కూలీలు రారని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు భావించారేమో!  గతంలో ఎన్ కౌంటర్ల చరిత్ర ఉన్న కాంతారావుకు ఖాళీగా ఉంటే తృప్తి ఇవ్వదేమో! ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి చంధ్రబాబు నుంచి కాంతారావు అనుమతి తీసుకున్నారు. స్మగ్లింగ్ కు పాల్పడుతున్నవారిపై కాల్పులు జరపడానికి అనుమతి కావాలని అడిగారు. అంటే ఉన్నత స్థాయిలోనే ఈ ఎన్ కౌంటర్ కు ప్రణాళిక జరిగిందని భావించవచ్చు.

సందేహాలు :

రాళ్ళ వర్షం కురిపిస్తున్న ఎర్రచందనం కూలీల నుంచి ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపినట్లయితే అక్కడ రాళ్ళు ఎందుకు కనిపించడంలేదు? అది రాళ్ళు లభ్యమయ్యే టెర్రయిన్ కూడా కాదు. కూలీలు విసిరిన రాళ్ళు ఏమయ్యాయి. ఎందుకు అక్కడ లేవు?

కూలీలు గొడ్డళ్ళతో, కొడవళ్ళతో దాడి చేశారని భావిస్తే ఆ గొడ్డళ్ళు తాజాగా దుకాణంలోంచి కొనుక్కుని వచ్చినట్లుగా ఎందుకు కనిపిస్తున్నాయి. చెట్లు నరకడానికి కూలీలు వారి వెంట గొడ్డళ్ళను తెచ్చుకున్నారని భావిస్తే మృతదేహాల పక్కన ఉన్న గొడళ్ళకు ఏ మాత్రం పదును ఎందుకు లేదు? వాటితో కూలీలు  ఏ విధంగా పెద్దపెద్ద ఎర్రచందనం వృక్షాలను నరకగలుగుతారు? వాటికి ఉండాల్సిన కర్రలు ఏమయ్యాయి. సంఘటనా స్థలంలో ఎందుకు కనిపించడంలేదు? మృతదేహాల పక్కన ఉన్న కొడవళ్ళు తుప్పు పట్టినవిగా ఎందుకున్నాయి. అసలు ఎర్రచందనం వృక్షాలను నరకడంలో కొడవళ్ళ అవసరమూ లేదు. నరికిన చెట్లను డ్రెస్సింగ్ చేసి దుంగలుగా మార్చడానికి కూడా కూలీలు గొడ్డళ్ళనే వాడుతున్నారనేదానికి అటవీశాఖ సిబ్బంది చెప్పే వివరాలే సరిపోతాయి. అవసరం లేని కొడవళ్ళు మృతదేహాల దగ్గరకు ఎలా వచ్చాయి? వాటిని తీసుకొచ్చినవారెవ్వరు?

సుమారు వందమందికి పైగా కూలీలు ఎర్రచందనం దుంగలను అడవిలో నరికి డ్రెస్సింగ్ చేసిన తర్వాత రోడ్డు ప్రాంతానికి వాహనంలో ఎక్కించడానికి తీసుకొస్తూ ఉంటే రాళ్ళ వర్షం కురిపిస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపితే చనిపోయింది ఇరవై మంధే అయితే మిగిలినవారంతా పారిపోతే వారు మోసుకొచ్చిన దుంగలెక్కడికి పోయాయి?

మృతదేహాల పక్కన దర్శనమిస్తున్న ఎర్రచందనం దుంగల్ని చూస్తే తాజాగా నరికినవి కాదని స్పష్టమవుతోంది. గతంలో ఎప్పుడో నరికినవని అర్థమవుతుంది. పైగా వాటికి ఎరుపు రంగు పెయింట్ వేయడం, వాటి మీద అటవీ శాఖ గతంలో చేసిన గుర్తులు ఎలా వచ్చాయి?

మృతిచెందిన ఇరవై మంది కూలీల్లో 17 మంది శరీరాలకు బుల్లెట్ లు దూసుకుపోయిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. అంటే బుల్లెట్ లు శరీరంలోంచి దూసుకుని బైటకు వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి దగ్గరి నుంచి కాల్చినట్లుగా స్పష్టమవుతోంది. నిజంగా రెండు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగితే దూరం నుంచే జరుగుతాయి తప్ప అంత దగ్గరి నుంచి జరిగే అవకాశమే లేదు. పైగా ఎధురు కాల్పులులో పోలీసులకు సీరియస్ గాయాలెందుకు కాలేదు?

కూలీలు నాటు తుపాకులు వాడినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు కూలీలు నాటు తుపాకులు వాడినట్లు అటవీ శాఖ చెప్పడమే లేదు.

కాల్పుల సంఘటన జరగడానికి ఒక రోజు ముందే నగరి-పుత్తూరు మార్గంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడుగురు కూడా ఈ ఇరవై మంది మృతుల్లో ఎలా చోటుచేసుకున్నారు. పోలీసులు చెప్తున్నదాని ప్రకారం అడవిలో చెట్లను నరికి దుంగలను మోసుకొస్తుండగా కాల్పులు జరగాయంటున్నారు. ముందు రోజు రాత్రి ఈ ఏడుగురు పోలీసుల అదుపులోకి వెళ్తే అడవిలోకి ఎప్పుడు వెళ్ళినట్లు?

ఈ ఏడుగురిని పోలీసులు పట్టుకెళ్తుండగా బస్సులోనే ఉండి ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఆ సమయంలో జరిగినదాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తగిన భద్రత కల్పిస్తే కోర్టులోగానీ, దర్యాప్తు బృందానికిగానీ వివరిస్తానని అంటున్నాడు.

మృతిచెందిన కూలీల శరీరాలపై ఉన్న తుపాకీ కాల్పులను పరిశీలిస్తే అందరికీ కూడా నడుముకు పై భాగన, అంటే ఛాతీ, వీపు, తల, మెడ తదితర ప్రాంతాల్లోనే బుల్లెట్లు తగిలాయి.

సుప్రీంకోర్టు 2002లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎదురు కాల్పులు జరిగిన ప్రతి సంఘటనలో అందులో పాల్గొన్న పోలీసులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేయాలని స్పష్టం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ ఎందుకు ఆ పని చేయలేదు?

పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ఎందుకు ఉల్లంఘించినట్లు?

ఇలాంటి ఎన్నో సందేహాలకు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. నేరాలను నియంత్రించడం పట్ల ఎంత పగడ్బందీగా వ్యవహరించాలో మానవ హక్కులను కాపాడడంలో కూడా ప్రభుత్వాలు అంతే నిక్కచ్చిగా వ్యవహరించాలి. నేరాలకు పాల్పడినంత మాత్రాన వారిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. వారిని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అ పని కూడా తామే చేస్తామని ప్రభుత్వాలు, పోలీసులు బుకాయిస్తే దాన్ని ప్రజాస్వామిక సమాజం ఒప్పుకోదు. ప్రభుత్వాలే మానవ హక్కులను ఉల్లంఘిస్తే ఇక పౌరులకు రక్షణ ఎక్కడుంటుంది? రక్షిత (ప్రొటెక్టెడ్) శేషాచలం అడవిలోకి కూలీలు వెళ్ళాల్సిన పని లేదు. అలా వెళ్తే నిషేధాజ్ఞలను ఉల్లంఘించడమే అవుతుంది. అందుకు చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం అటవీ శాఖకూ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ కూ ఉంది. కానీ ఆ చర్యలు ఎన్ కౌంటరే అంటే సమంజసం కాదు. అఢవిలో ఒక పక్షిని కాల్చడానికి కూడా అనుమతి అవసరం అనే నిబంధనలు ఉన్న మన ప్రజాస్వామ్యంలో, చట్టంలో పౌరులను పిట్టల్లాగా కాల్చే హక్కు పోలీసులకు ఎలా ఉంటుంది?

అక్కడ సిమీ ఉగ్రవాదులుగానీ, ఇక్కడ ఎర్రచందనం కూలీలుగానీ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడ్డారనడంలో ఎలాంటి సంధేహమూ లేదు. అయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలి తప్ప కాల్చి చంపడమే పరిష్కారం అని ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తే నేరమే అవుతుంది తప్ప సమాజం ఇలాంటి శిక్షలను ఆమోదించదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.