కుదరని ఏకాభిప్రాయం!

హైదరాబాద్, అక్టోబర్ 29: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, కొనసాగిస్తామని అటు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నాయి. ఇరు రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న శ్రీశైలం విద్యుత్ ఉత్ప‌త్తి వివాదం ప‌రిష్కారానికి కృష్ణా రివ‌ర్ బోర్డు న‌డుం బిగించింది. దీంతో ఈ రోజు ఇరు రాష్ట్రాల అధికారుల‌తో బోర్డు ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఎర్రమంజిల్ లోని జలసౌధలో ఏర్పాటు చేసింది.

krishna water board_press meet

మీడియాతో మాట్లాడుతున్న కృష్ణా బోర్డు కార్యదర్శి గుప్తా

శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టంపై ఇరు ప్రాంతాల అధికారుల మధ్య వాడీ, వేడిగా చర్చ జరిగింది. బుధవారం మధ్యాహ్నం మొదలైన కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం 3వ తేదీ వరకు 3 టీఎంసీల నీటిని వాడుకోవాలని బోర్డు సూచించడంతో, దానికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. దీంతో పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. నేటి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరనందున రేపు ఉదయం 11 గంటలకు మరోసారి సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశానికి చైర్మన్ ఎస్‌కేజీ పండిట్, కార్యదర్శి గుప్తా, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.