కృష్ణా ట్రిబ్యునల్ విచారణ మార్చి 30కి వాయిదా

కృష్ణా జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాల మధ్ జరగాలా లేక రెండు కొత్త రాష్ట్రాల మధ్యనే జరగాలా అనే విషయానికి సంబంధించిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ తదుపరి విచారణను మార్చి నెల 30వ తేదీకి వాయిదా వేసింది. వరుసగా మూడు రోజుల పాటు విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. బుధవారం మొదలు శుక్రవారం వరకు జరిగిన మూడు రోజుల విచారణలో కర్నాటక, మహారాష్ట్రాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదుల వాదనలు వినిపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తరఫున వాదనలను మార్చి నెల 30వ తేదీ నుంచి జరుగుతాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

కర్ణాటక తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ వాదిస్తూ, కృష్ణా జలాల పంపిణీ ప్ర్రకియ 2013 డిసెంబరుతోనే ముగిసిపోయిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్దిష్టమైన నీటి కేటాయింపులు జరిగిపోయాయని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున ఆ వాటానే రెండు కొత్త రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాలి తప్ప మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ ప్ర్రక్రియను చేపట్టాల్సిన పని లేదని వాదించారు. ఇందుకోసం పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 89తో సహా ఆస్తులు, అప్పులు, ఇతర వాటాలను రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవడంపై పేర్కొన్న అంశాలను ట్రిబ్యునల్ కు వివరించారు. ఇదే తరహాలో కృష్ణా జలాలను కూడా రెండు కొత్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో పంచుకోవాలని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ట్రిబ్యునల్ నవంబర్ 2013లో చేసిన కేటాయింపులను తాకరాదని స్పష్టం చేశారు. ఒకటిన్నర రోజు పాటు వాదనలను వినిపించారు.

మహారాష్ట్ర తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అంద్యార్జున గురువారం వాదనలను మొదలుపెట్టి శుక్రవారం సాయంత్రం వరకూ కొనసాగించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న సెక్షన్ 89 కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినది మాత్రమేనని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ట్రిబ్యునల్ తన మధ్యంతర ఉత్తర్వుల్లో నిర్దిష్టమైన కేటాయింపులు చేసిన తర్వాత మూడు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో తిరిగి విచారణ జరిపి 2013 నవంబరులో తుది ఉత్తర్వులను ఇచ్చిందని, ఇక మరో నివేదికతో అవసరమే లేదని వాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సైతం ఎక్కడా కూడా నీటి పంపకాలను నాలుగు రాష్ట్రాల మధ్య జరగాలని స్పష్టత ఇవ్వలేదని అన్నారు. చట్టంలోని సెక్షన్ 89లో కొంత అస్పష్టత ఉన్నదని, ఏ రకంగానైనా వర్తింపచేసుకునే తీరులో ఉన్నదని వ్యాఖ్యానించారు. 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తిరిగి మరో నివేదిక అవసరం ఉండదని అంతరాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 5 (2) ప్రకారం స్పష్టమవుతున్నదని, అందువల్ల మరోమారు విచారణ జరపడంగానీ, తుది ఉత్తర్వులను ఇవ్వడంగానీ అవసరమే ఉండదని అన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సైతం ఒక పిటీషన్ ను దాఖలు చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అవసరాలను గురించి బచావత్ ట్రిబ్యునల్ ముందుగానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుగానీ సరైన తీరులో వాదించలేదని, ఇప్పుడు అదే అసంతృప్తితో ఉన్నందువల్ల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 89 ప్రకారం తగిన వాటా పొందేందుకు ప్రయత్నించాలని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలకు ట్రిబ్యునల్ తన తుది ఉత్తర్వుల్లో చేసిన కేటాయింపులను ఏ మాత్రం తాకకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపులనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని అన్నారు.

ట్రిబ్యునల్ విచారణ పరిధి నాలుగు రాష్ట్రాలకు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే లిఖితపూర్వకంగా ట్రిబ్యునల్ కు స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి విచారణ మార్చి నెల 30వ తేదీన జరుగుతుంది కాబట్టి మూడు రోజుల పాటు ఈ రాష్ట్రాల తరఫున న్యాయవాదులు వాదించనున్నారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులను ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేస్తూ కర్ణాటక, మహారాష్ట్రాలను ఈ పరిధి నుంచి మినహాయించడాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (ఉమ్మడిగా ఉన్న సమయంలో) ట్రిబ్యునల్ తుది ఉత్తర్వుల్లో అన్యాయం జరిగిందని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, తెలంగాణ రాష్ట్ర అవసరాల గురించి ట్రిబ్యునల్ ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన తీరులో వాదించలేదని, ఆ విధంగా అన్యాయం జరిగిందని, ఇప్పుడు కొత్త రాష్ట్రంగా ఏర్పడినందున వాదనలు వినిపించుకునే అవకాశం వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే ఒక పిటీషన్ ను దాఖలు చేసింది. ఇదే విషయాన్ని ట్రిబ్యునల్ కు సైతం తెలియజేసి కృష్ణా నదీ జలాల పంపిణీ సహేతుకంగా జరగాలంటే తప్పనిసరిగా నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ కావాలని ట్రిబ్యునల్ కు గతంలో చేసిన వాదనల సందర్భంగా స్పష్టం చేసింది. అందువల్ల వచ్చే నెల చివరలో జరగనున్న వాదనల్లో తప్పనిసరిగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా ట్రిబ్యునల్ కు స్పష్టం చేసి తగిన వాటా పొందే విధంగా తీర్పునివ్వాలని కోరే అవకాశం ఉంది.

తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్, రవీంద్రరావు, విద్యాసాగర్, కృష్ణమూర్తిస్వామి తదితరులు హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది గంగూలి సహా గుంటూరు ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.