కేంద్రం పాలనలో దేశం, రాష్ట్రం ఉంటే మంచిదే: జేసీ

రాజకీయ లాభం కోసమే రాష్ట్ర విభజన జరుగుతోందని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల దేశసమైక్యతకు భంగం కలుగుతుందని అన్నారు. రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతిని కలిసి తమ అభిప్రాయాన్ని, విభజనపై ఉన్న వ్యతిరేకతను, అత్యధిక ప్రజల ఆకాంక్షను వివరిస్తామన్నారు. తక్షణం రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపాలని ఆయనను డిమాండ్ చేస్తామని అన్నారు.

సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులంతా వ్యక్తులుగా కాకుండా, సమిష్ఠిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తామంతా కలసి సమైక్య తీర్మానంకోసం పట్టుబడుతున్నామని తెలిపారు. దేశం మొత్తాన్ని కలిపేస్తే బాగుంటుందన్న ఒక విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ ఒకే దేశము, ఒకే రాష్ట్రం అయితే మరింత బాగుంటుందన్నారు. అప్పుడు ఎవరూ వనరుల కోసం, నీళ్ల కోసం కొట్టుకోరని అన్నారు.

అందరికీ ఈ దేశం నాదే.. నేను ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు అనే భావం ఉంటుందని వివరించారు. అధిష్ఠానం తీరుతో ఏం చేయాలో తమకే తెలియడం లేదని అన్నారు. సీఎం గట్టిగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని అన్నారు. తాను గతంలో వినిపించిన రాయల తెలంగాణ, రాయలసీమ వంటి వాదనలన్నీ విభజనను ఆపేందుకేనని జేసీ అన్నారు. అనంతపురం జిల్లా కోసం, ఆ జిల్లా ప్రజల కోసం తాను సమైక్యాన్ని కోరుకుంటున్నానని అన్నారు. తమకు ఒక్క చుక్క నీరు కూడా లేదని.. కేవలం కృష్ణా నదీ జలాలపైనే అధారపడాల్సి ఉందని అన్నారు. విభజన జరిగితే తాము బ్రతకడం కూడా కష్టమని ఆయన అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.