కేజీ డీ6 లో ఉత్పత్తి పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రణాళికలు

kg d-6-gas

విభిన్న కారణాలతో కేజీ డీ6 లో అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోంది. దీని కోసం తన భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికను రెడీ చేస్తోంది. ప్రస్తుతం కృష్టా, గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ తో పోలిస్తే 2020నాటికి నాలుగింతలు గ్యాస్ ను ఉత్పత్తి చేయాలని ఆర్ ఐఎల్ నిర్ణయించింది. దీని కోసం అన్ని రకాల చర్యలను చేపడతామని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత కేజీ డీ6 లో కొత్త ఒక బావి అందుబాటులోకి రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 13ఎమ్ సీఎండీల గ్యాస్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇంకా మరికొన్ని బావులు అందుబాటులోకి రావాల్సి ఉంది.

కొత్త బావుల్లో గ్యాస్ ఉత్పత్తి మొదలైతే మొత్తం ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడం ఏమంత కష్టం కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్గాలన్నాయి. ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తే 2020 నాటికి ఉత్పత్తిని 40ఎమ్ సీఎండీలకు పెంచుతామని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా ప్రణాళికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ కేజీ డీ6 లో ఉత్పత్తి కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడానికి కారణాలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త గ్యాస్ ధర అమల్లోకి రానుండటంతో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి పెంపు నిర్ణయాలు చేస్తోందని వారు విమర్శిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.