కేజ్రివాల్ కు ప్రశ్నాస్త్రాలు సంధించిన ‘ఆమ్ ఆద్మీ’

Aravind-kejriwal-apologises

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు ఓ ‘ఆమ్ ఆద్మీ’ (సామాన్యుడు) కొన్ని ప్రశ్నాస్త్రాలు లేఖ రూపంలో సంధించాడు. జాతీయ మీడియాలో వచ్చిన ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

1. గత కొన్ని రోజులుగా నేవీలో జరుగుతున్న దుర్ఘటనల పట్ల మీరు గొంతెత్తడంలేదు. రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడడంలేదు. ఎందుకని? ఇతర అంశాలపై దృష్టి పెడితే మీ రాజకీయ పురోగతి దెబ్బతింటుందనా? రక్షణ సిబ్బంది ప్రాణాల కంటే రాజకీయాలే ఎక్కువని భావిస్తున్నారా?

2. వేల కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు వ్యతిరేకంగా మీరేమీ వ్యాఖ్యానించలేదు. ఎందుకలా… ?

3. నేను యూపీలో పుట్టి పెరిగాను. అక్కడ రౌడీయిజం, అవినితి ఎక్కువ. అలాంటివే ఇంకా ఎన్నో సమస్యలు. అలాంటిది మీరు ఉత్తరప్రదేశ్ ను వదిలి గుజరాత్ లో పర్యటించడంలో అంతర్యమేంటి? ప్రధాని రేసులో ఉన్న మోడీకి మీరే పెద్ద ముప్పు అని చాటుకునేందుకే గుజరాత్ వెళ్ళారా?

4. దేశంలోని నేతలు హెలికాప్టర్లు ఉపయోగిస్తే మీరు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల మీరు ఇండియా టుడే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చాపర్ ఉపయోగించారు. అప్పుడు ఆ హెలికాప్టర్ ను ఈవెంట్ నిర్వాహకులు సమకూర్చారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా తమ నల్లధనం గురించి ప్రశ్నించకుండా ఉండేందుకుని మీకు హెలికాప్టర్ సమకూర్చి కార్యక్రమానికి రమ్మంటారు. అప్పుడా సొమ్ము నిజాయతీగా సంపాదించింది అవుతుందా? లేక, నల్లధనం అవుతుందా?

5. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేస్తామని మీ పార్టీ చెబుతోంది. కానీ, కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్ వంటి మీ పార్టీ నేతలు తమకిష్టమైన నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి ప్రజల ఇష్టాయిష్టాలు పట్టించుకోరా? పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం కాదా ఇది?

6. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేత ముఖానికి ఓ వ్యక్తి ఇంకు పులమడాన్ని పిరికి చర్య అని అభివర్ణిస్తున్నారు మీరు, అదటుంచితే, 2009లో మంత్రి చిదంబరంపైకి జర్నైల్ సింగ్ అనే వ్యక్తి బూటు విసిరాడు. ఇప్పుడా వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఎందుకు భావించరు? బూటు విసరడం ఏ విధంగా న్యాయసమ్మతం అని చెబుతారు?

7. అవినీతిపై మీరు చేసిన పోరాటాన్ని ప్రస్తుతించినప్పుడు మీడియాను పొగుడుతారు. అదే, ప్రభుత్వ బంగ్లా విషయంలో మీ స్పందనను ప్రజలకు తెలిపినందుకు మీడియాను విమర్శిస్తారు. అవి పెయిడ్ న్యూస్ అని వర్గీకరిస్తారు! స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుత మీడియా వ్యవస్థపై మీకు నమ్మకంలేదా?

8. ఉన్నట్టుండి మీరు బీజేపీ ప్రధాని అభ్యర్థిపై కాలు దువ్వడంలో అంతర్యమేంటి? అదే సమయంలో కాంగ్రెస్ తో మాత్రం సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి మీరు ప్రధాని పదవిని ఆశిస్తున్నారని, ఈ క్రమంలో ప్రధాన అడ్డంకి నరేంద్ర మోడీయేని భావిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? కాంగ్రెస్ కు పెద్దగా స్థానాలు దక్కవన్న ఒపీనియన్ పోల్స్ ను మీరూ ఫాలో అవుతున్నారా?

ఈ ప్రశ్నలన్నింటికి అరవింద్ కేజ్రివాల్ త్వరలోనే జవాబులు రాస్తారని ఆశిస్తున్నానంటూ సదరు ఆమ్ ఆద్మీ (సామాన్యుడు) లేఖ ముగించాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.