కేసీఆర్ ని కలిసిన నీతి ఆయోగ్ సభ్యులు

kcr-niti ayog-9

నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్, సలహాదారు అశోక్ జైన్ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, స్వచ్చ తెలంగాణ, విద్య, వైద్య రంగాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.

హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు వెనుకబడిన విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. దేశానికే తలమానికమైన ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు తగిన  సహయం అందించాలని  కోరారు. అదే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ఇచ్చే నిధులను తమ రాష్ట్రానికి కూడ కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. వెనకబాటు ప్రాంతాల అభివృద్ది నిధుల కోసం బీఆర్ జీఎఫ్ కింద అందించే సహకారానికి కోత విధించడంతో, ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన వేయి కోట్లు నిలిచిపోయాయి. అదే విధంగా కేంద్రం నుండి వివిధ పథకాల కింద వచ్చే నిధుల్లో కోత విధించడం వల్ల సంక్షేమ పథకాల భారం ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలను సడలించాలని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన సమయంలో కూడా ప్రభుత్వం ఇదే అంశాన్ని మరోసారి లేవనెత్తింది. ఎఫ్ ఆర్ బీఎమ్ పరిమితి పెంచుతూ మర్గదర్శకాలు సవరించాలని ముఖ్యమంత్రి సభ్యులను కోరారు. తెలంగాణ రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నందున అప్పులు భారం కావని దరిమిలా ఎక్కువ అప్పులు తీసుకునే వెసులు బాటు కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకునే పరిమితికి సమానంగా తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.