కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు

Konda-couple-join-TRS

కొండా దంపతులు కేసీఆర్ తో సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కండువా కప్పి కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కేవలం కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ నచ్చడం వల్లే టీఆర్ఎస్ లో తాను, తన భర్త మురళి బేషరతుగా చేరుతున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ బలమైన నాయకత్వంతోనే సాధ్యమని సురేఖ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సైనికుల్లా పని చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాకముందు పరిస్థితులు వేరని తెలంగాణ వచ్చాక అందరం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం కావాలని కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ ఘటన చాలా దురదృష్టకరమని, గతాన్ని మరిచిపోయి అందరం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పాటు పడి బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్నరు.

టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ పేరు కూడా ఉచ్ఛరించలేని దుస్థితిలో తెలంగాణ ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో పేదల బతుకు మార్చేందుకు టీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఆంధ్రా భాషనే మాట్లాడే వాళ్లమని ఆయన తెలిపారు. తెలంగాణలో 85 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ ఒక్క గది ఉన్న ఇంటినే నిర్మించాయని, 125 గజాల స్థలంలో హాలు, వంటగది, బెడ్రూం ఉండేలా ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.

దీనికి 2.75 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రూపాయి రుణం లేకుండా బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హామీలు నెరవేర్చే బాధ్యత తనదేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కులాల పేరిట హాస్టళ్లు ఉండవని, అందరికీ ఒకే సదుపాయాలతో హాస్టళ్లు ఉంటాయని, స్విమ్మింగ్ పూళ్లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.