కొత్త పార్టీ పెడుతున్నా… 12న ప్రకటిస్తా: కిరణ్

Kiran-kumar-reddy-convoy

కొత్త పార్టీ పెడుతున్నామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ… ఈ నెల 12న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో అన్ని వివరాలు చెబుతామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఏకం చేయడమే పార్టీ లక్ష్యమని, పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి సభలో ఇతర వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

తన జీవితం, తాను అనుభవించిన ముఖ్యమంత్రి పదవీకాలం అంతా తెరచిన పుస్తకమని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలనలో పారదర్శకత తెచ్చేందుకే కృషి చేశానని ఆయన అన్నారు. తాను చేసిన తప్పుల్ని నిరూపించాలని ప్రత్యర్థులకు ఆయన సవాలు విసిరారు. మూడేళ్ల పాలనను తిరగదోడతామంటే భయపడేది లేదని అన్నారు. తాను అన్నింటికీ సిద్ధమయ్యానని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలన్నీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయని కిరణ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో చేతులు కలిపిన పార్టీలన్నీ తప్పుడు కూతలు కూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు అధికార దాహం తప్ప మరేమీ అక్కర్లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీ అన్నీ ఈ పాపంలో పాలుపంచుకుని ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాయని ఆయన విమర్శించారు. వారు చెప్పే మాటలకు అర్థం లేదని ఆయన తెలిపారు. తమ పార్టీ లక్ష్యం తెలుగు ప్రజల గుండె చప్పుడు వినిపించడమేనని వెల్లడించారు. తనకు పదవీ వ్యామోహం లేదని, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజనను వ్యతిరేకించానని ఆయన గుర్తు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.