కొత్త భూసేకరణ చట్టం

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్ర భూసేకరణ పునరావాస చట్టాన్ని, వివిధ రాష్ట్రాలు భూసేకరణలో అమలు చేస్తున్న నిబంధనలను ఆయన పరిశీలించారు. భూమి కోల్పోయేవారికి ఆసరాగా కొత్త చట్టం ఉండాలని అధికారులకు నిర్దేశించారు. భూసేకరణ పునరావాస చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భూమిని సేకరించే క్రమంలో నిర్వాసితులపట్ల అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని, పునరావాస ప్యాకేజీని వీలైనంత తొందరగా అందించాలని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ విలువకన్నా ఎక్కువ మొత్తాన్ని నిర్వాసితులకు అందాలని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ భూమి కావాల్సి ఉన్నందున, ఎక్కువమంది నిర్వాసితులుంటారని, వారి పునరావాసానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. నిర్వాసితులతో చర్చించి పరిహారాన్ని నిర్ధారించాలన్నారు.

పరిహారాన్ని ముందే బ్యాంకులో జమ చేయాలని, నిర్వాసితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి తీసుకురావద్దని కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో పరిశ్రమ స్థాపనకు గరిష్ఠంగా రెండు వేల ఎకరాలను సేకరించటం, ఆహార భద్రతకులోటు రాకుండా 15% లోపే వ్యవసాయ భూములను సేకరించేలా చట్టం రూపొందించే అంశాలను సమావేశంలో చర్చించారు. భూ సేకరణ నిర్వాసితులకు శాపంగా మారకూడదని సీఎం సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టీ హరీశ్‌రావు, కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.